YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మోడీ నామస్మరణ చేస్తున్నా...అంతేనా

మోడీ నామస్మరణ చేస్తున్నా...అంతేనా

పాపం చంద్రబాబు, తనకు నచ్చిన పార్టీ వైపు రాలేకపోతే పోవచ్చు కానీ ఆయన వద్దనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళి మరీ క‌లిపేయడం అంటే బాధే మరి. చంద్రబాబు మీద ఎపుడూ వాడి వేడి బాణాలు వేసే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు బాబును ఏపీలో అసలు ప్రతిపక్షమే కాదని తేల్చేశారు. ఆయన ఫక్త్ కాంగ్రెస్ పక్షమట. నిజానికి కాంగ్రెస్ పార్టీకి బాబు తలాఖ్ చెప్పేసి చాలా కాలమే అయింది. ఆయన ఆ మధ్య సోనియా గాంధీ పెట్టిన ప్రతిపక్ష పార్టీ మీటింగ్ కి ఆహ్వానం వచ్చినా కూడా కనీసం ఉలకలేదు, పలకలేదు. పైగా మోడీ నామస్మరణలోనే ప్రతీ రోజూ తరిస్తున్నారు కూడా.ఏపీలో కాంగ్రెస్ అంటే జనాలకు మా చెడ్డ కోపం. అందువల్ల చంద్రబాబుకీ కాంగ్రెస్ కి కలిపి ముడేస్తే ఆ వ్యతిరేకత ఆయనకు కూడా అంటుకుని ప్రతిపక్ష స్థానం నుంచి మరింతగా దిగజారుతారని బీజేపీ ఎత్తులు వేస్తున్నట్లుగా ఉంది. ఏపీలో కాంగ్రెస్ అయితే చంద్రబాబుతో దోస్తీకి ఎపుడూ రెడీనే. ఆ పార్టీ నేతలు తులసీరెడ్డి, శైలజానాధ్ లాంటి వారు అయితే బాబు చెప్పిన మాటలనే తాము కూడా తరచూ వల్లెవేస్తూంటారు. కానీ బాబు తెలివైన నాయకుడు కాబట్టి వారి విషయం పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తారు అని అంటారు.వీర్రాజు చంద్రబాబుని కాంగ్రెస్ ని కలిపి విమర్శించడానికి కారణాలు ఉన్నాయి. 2019 ఎన్నికల వేళ రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామనే బాబు దేశమంతా తిరిగారు. చివరికి అది బెడిసికొట్టింది. ఆ తరువాత బాబు ప్లేట్ ఫిరాయించినా కూడా మోడీ టీమ్ కరుణించడంలేదు. ఇక 2024 ఎన్నికల వేళ చంద్రబాబు ఎలా ఉంటారో ఆయనకే తెలియదు. అప్పటికి మోడీ ప్రభ తరిగిపోయి కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమికి బలం పెరిగితే ముందు జంప్ చేసేవారు చంద్రబాబే. అందువల్ల ఆయన విశ్వసనీయతను జనంలో చర్చకు పెట్టాలనే సోము ఇలా విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. పైగా ఇపుడు బీజేపీకి తక్షణ అధికారం ముఖ్యం కాదు, బాబుని బదనాం చేసి ప్రధాన ప్రతిపక్షం కావడమే ముందున్న టార్గెట్. దాంతో బాబు మీదనే ఆయన విరుచుకుపడుతున్నారని అంటున్నారు.చంద్రబాబు ఆయన తనయుడు టీడీపీని కుటుంబ పార్టీగా మార్చేశారని కూడా వీర్రాజు అంటున్నారు. ఇది పాత ఆరోపణే అయినప్పటికీ ఇపుడు లోకేష్ మీద తమ్ముళ్ళకు ఉన్న అసంతృప్తిని తమ వైపు లాక్కోవడానికి సోము ప్రయోగించిన అస్త్రంగా భావిస్తున్నారు. చంద్రబాబు ఎన్టీయార్ అల్లుడిగా పార్టీని లాక్కున్నా తమ్ముళ్ళు అప్పట్లో ఆయన వెంట నడిచారు, కానీ ఇపుడు లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం లేని తమ్ముళ్ళు ఆయన్ని కాదనుకుంటున్నారు. దాంతో టీడీపీకి అసలైన ఆల్టర్నేషన్ బీజేపీ మాత్రమేనని సోము గట్టిగానే చెబుతున్నారు. అందుకోసమే చంద్రబాబుని, లోకేష్ ల నాయకత్వంలోని టీడీపీని ఒక పార్టీగా కాకుండా వారి కుటుంబ పెత్తనంగా తమ్ముళ్లకే చూపిస్తున్నారు. మరి ఈ ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో తెలియదు కానీ చంద్రబాబు భూత వర్తమాన భవిష్యత్తు వ్యూహాలను సోము ఇలా బయటపెట్టేస్తున్నారు.

Related Posts