రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పైసలిస్తలేదు. భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల మేనేజ్మెంట్లు తెల్చి చెప్తున్నాయి. దీంతో ఇటు ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు చేతికి రాక.. అటు పైకోర్సుల్లో చేరలేక స్టూడెంట్లు ఆగమవుతున్నారు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగావకాశాలు కూడా కోల్పోతున్నారు. కొందరు అప్పొసప్పో చేసి ఫీజులు కడుతుంటే.. మరికొందరు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. రూ. వెయ్యి కోట్లకు పైగా ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఏటా సర్కారు ఇట్లనే వ్యవహరిస్తున్నదని, స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారని స్టూడెంట్ యూనియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల అప్లికేషన్ల పరిశీలనే నత్తనడకన సాగింది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, బీఈడీ తదితర అన్ని రకాల కోర్సులు కలిపి మొత్తం 12.5 లక్షల మందికి ఫీజులు చెల్లించాల్సి ఉంది.ఇందులో ఫ్రెషర్స్ 5.5 లక్షలు, రెన్యువల్స్ 7 లక్షల మంది ఉన్నారు. వీళ్లు ఫీజుల కోసం చూస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 1,054 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2018–19, 2019–20 అకడమిక్ ఇయర్స్లో రూ. 1,036 కోట్ల పెండింగ్లో ఉన్నాయి. 2019 – 20 అకడమిక్ ఇయర్లో రూ. 1,988 కోట్ల వెరిఫైడ్ డిమాండ్ ఉండగా.. రూ. 1,050 కోట్లు మాత్రమే సర్కారు చెల్లించింది. మరో రూ. 938 కోట్లు పెండింగ్లో ఉండగా.. ఇందులో రూ. 745 కోట్లు రీయింబర్స్‌మెంట్స్, రూ. 193 కోట్లు స్కాలర్షిప్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి రీయింబర్స్మెంట్ డబ్బులు రూ. 85 కోట్లు, స్కాలర్షిప్ డబ్బులు రూ. 13 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంతకు ముందు అకడమిక్ ఇయర్లోనూ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.