ఆన్‌లైన్ రమ్మీపై తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉంది... దీంతో కొందరు పేకాటరాయుళ్లు ఇతర రాష్ర్టాల్లో ఉన్నట్లుగా.. నకిలీ జీపీఎస్ యాప్‌లను ఉపయోగించి.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో లభిస్తున్న పలు మొబైల్ అప్లికేషన్లతో నకిలీ జీపీఎస్‌లను ఉపయోగిస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆన్‌లైన్ బెట్టింగ్‌ల పై ఉక్కుపాదం మోపుతూ, 2017లోనే ఆన్‌లైన్ రమ్మీపై కూడా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆన్‌లైన్లో ఈ రమ్మీ గేమ్ ఆడేందుకు అవకాశం లేదు. ఇక్కడ ఈ గేమ్ ఆన్‌లైన్‌లో ఓపెన్ కూడా కాదు. అయినా.. కొందరు నకిలీ జీపీఎస్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.ఆన్ లైన్ జరిగే రమ్మీ గేమ్.. ప్రోగ్రామింగ్ ద్వారా జరుగుతుంది. అది నిర్వాహకులకు అనుకూలంగానే ఉంటుంది. రెండు నెలల క్రితం భారీ ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చైనా దేశానికి చెందిన కొందరు, భారతీయులతో కలిసి కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ను తయారు చేసి.. నాలుగైదు నెలల్లోనే వందల కోట్లు ఈ గేమ్ ద్వారా వసూలు చేశారు. ఆ డబ్బంతా చైనాకు పంపడం, బ్లాక్‌మార్కెట్‌లోకి తరలించడం చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఆన్‌లైన్ రమ్మీ కూడా జరుగుతుంది. అయితే.. ఆన్‌లైన్ రమ్మీకి ఎక్కువ యూజర్లు ఉండటంతో భారీ సంఖ్యలో అమాయక ప్రజలు ఈ ఆటకు ఆకర్షితులవుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ రమ్మీని నిషేధించింది. ఇక్కడ ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నిషేధం కొనసాగుతుండటంతో చాలామంది.. గతంలో ఇతర రాష్ర్టాలకు వెళ్లి ఆడి వచ్చేవారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌ను కూడా.. ఇక్కడే కూర్చొని ఆడొచ్చని కొన్ని సంస్థలు గుర్తించి.. నకిలీ జీపీఎస్ ఏర్పాటు చేసి .. కొత్త అప్లికేషన్లను తయారు చేసి బెట్టింగ్ రాయుళ్లకు దారి చూపించా రు. దీంతో ప్రస్తుతం చాలా మంది బెట్టింగ్ రాయుళ్లు హైదరాబాద్‌లో కూర్చొని... తాము కర్ణాటక, మహారాష్ట్ర, జమ్ముకాశ్మీర్ నుంచి ఆడుతున్నట్లు నకిలీ జీపీఎస్‌తో తమ సెల్‌ఫోన్‌లో లొకేషన్ మార్చుకొని ఆడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ రమ్మీ ఇక్కడ ఓపెన్ అవుతుంది.