YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెంగుళూర్ దారి పడుతున్న అనంత వాసులు

బెంగుళూర్ దారి పడుతున్న అనంత వాసులు

అనంతలో నిరుడు తీవ్ర వర్షాభావం నెలకొంది. సరైన వర్షాలు లేక ఖరీఫ్‌లో ప్రధానంగా సాగు చేసే వేరుసెనగ చేతికి రాకుండా పోయింది. ఈతరుణంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందంటేనే కరువు ఏస్థాయిలో  ఉందో తెలుస్తోంది. ఈ స్థితిలో అప్పులను తీర్చేందుకు రైతులు, రైతుకూలీలు బతికేందుకు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వలసెళ్లారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల కుటుంబాలు వలసెళ్లినట్లు పలు స్వచ్ఛందసంస్థలు తేల్చాయి. వలసపోలేక, అప్పులు తీర్చే మార్గం లేక చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ 65మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే క్రమంలో వలసెళ్లిన వారు కూడా మృత్యువాతపడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదుఆ తర్వాత రబీలో సైతం వరుణుడి జాడ లేదు. రబీలో పంటల సాగే తక్కువగా ఉండగా, అవి కూడా సగమైనా చేతికందని పరిస్థితి ఏర్పడింది. పప్పుశనగ విత్తు తీసుకున్న రైతులు కూడా వర్షాలు లేక విత్తునే అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇంతటి ఘోర పరిస్థితుల నేపథ్యంలో అంతా వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా రైతు కూలీలకు పనులు లేకుండాపోయాయి. ఒకప్పుడు పనులు కల్పించే అన్నదాతలు కూడా తామే పని వెతుక్కుంటూ వేరొక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని సగానికిపైగా మండలాల్లో పనుల కోసం వలసలు వెళ్లిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్లాయి. ఇంటి వద్ద ముసలివారు, పిల్లలను విడిచి పెట్టి.. పనిచేయగలిగే వారంతా వలసబాట పట్టారు. ప్రతిసారి ఈ జిల్లా నుంచి కర్ణాటక, కేరళ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్తుంటారు.కేరళ, కర్ణాటకల్లో వివిధ నగరాల్లో అనంత జిల్లా రైతులు, రైతు కూలీలు పనుల కోసం వెళ్లి కష్టాలు పడుతుండటం, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తుండటం, పనుల కోసం అక్కడ పడిగాపులు పడుతున్నారు. అసలు ఎంత మంది వలస వెళ్లారనేది తేల్చేందుకు అధికారులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే జరిపారు. అనంతపురం జిల్లాలో వలసవెళ్లినవారి సంఖ్య దాదాపు 13 వేల వరకు ఉన్నట్లు తేలినట్లు సమాచారం. వీరిలో 700 మంది వరకు కేరళలో ఉన్నట్లు తేల్చారు. అలాగే కేవలం బెంగళూరు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, కర్ణాటకలోని ఇంకొన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 10 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా వలసలు వెళ్లారు.కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల నుంచి కూడా కొంత మేరకు వలసలు ఉన్నట్లు గుర్తించారు. కేవలం కొన్ని మండలాల్లోనే వేల మంది వలసలు వెళ్లారనీ, జిల్లా అంతటా చూస్తే ఈ సంఖ్య లక్షల్లో ఉండటం ఖాయమని పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం తాము ఓ పద్ధతి ప్రకారం సర్వే చేశామని, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఎవరైనా వలస వెళితే ఎక్కడకు వెళ్లారు? వారి పేర్లు? ఫోన్‌ నంబర్లు సైతం సేకరించామని, ఆయా గ్రామాల పరిధిలో ఉపాధి పనులు మరింత పెంచుతున్నట్లు వివరిస్తున్నారు. మీ గ్రామాల్లో పనులు పెడుతున్నామని, వెనక్కి వచ్చేయవచ్చని వలసపోయిన వారికి ఫోన్లు చేసి చెబుతున్నామంటున్నారు. మరోవైపు అధికారిక వలసల లెక్కను అధికారులు ఇంకా బయటపెట్టలేదు. 

Related Posts