ఇంజినీరింగ్‌లో ఎవర్‌గ్రీన్ అయిన ఆ కోర్సులకు ఇప్పుడు కాలం చెల్లిందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. సాంకేతిక విద్యలో రోజురోజుకు కొత్త కోర్సులు వచ్చి చేరుతున్నాయి. మంచి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో విద్యార్థులు ఆ కోర్సులవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో పురాతన కోర్సులైన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతున్నది. ఈ కోర్సుల్లో చదవడానికి విద్యార్థులు ముందుకు రాకపోవడంతో ప్రతిఏడాది సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కాలేజీలు కూడా ఈ బ్రాంచీల సీట్లలో కోత విధిస్తున్నాయి. ఈనేపథ్యంలో వీటిని తిరిగి నిలబెట్టుకొనేందుకు వర్సిటీలు, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో మెకానికల్, సివిల్ కోర్సులు మరుగున పడిపోతున్నాయి. యాజమాన్యాలు కూడా డిమాండ్ అనుగుణంగా ఉండే ఇంజినీరింగ్ కోర్సులను మాత్రమే కొనసాగిస్తూ, మెకానికల్, సివిల్ సీట్లకు కోత పెడుతున్నాయి. గతేడాది వరకు మెకానికల్ ఇంజినీరింగ్‌లో దాదాపు 10 వేలకు పైగా సీట్లు ఉండేవి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2020–21) ఆ సంఖ్య 6,059కి పడిపోయింది. అందులోనూ 3,287 సీట్లు మాత్రమే నిండాయి. ఇంకా 2,772 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని సీనియర్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచీలో 6,415 సీట్లు ఉండగా, 3,722 సీట్లు మాత్రమే నిండాయి. ఈ విధానం ఇలాగే కొనసాగితే మున్ముందు దేశవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న మెకానికల్ ఇంజినీర్ల కొరత ఏర్పడుతుందని, ఆ ప్రభావం పారిశ్రామిక రంగాలపై తీవ్రంగా పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.