ఏలూరు, నవంబర్ 12,
ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొద్దినెలలుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆయన కరోనా తగ్గిన తర్వాత నర్సాపురం వస్తానని చెప్పినా ఇప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తనపై ఉన్న అనర్హత పిటీషన్ విషయం తేలేవరకూ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలోనే ఉండాలని ినిర్ణయించుకున్నట్లుంది. ప్రతి రోజూ తన పిటీషన్ పై ఉన్న అప్ డేట్ ను ఆయన తెలుసుకోవడంలోనే బిజీగా ఉన్నారు.గత ఏడాది మార్చి నెల నుంచి రఘురామ కృష్ణంరాజు ఏపీకి రావడం లేదు. ఆయన కరోనా కారణంగా రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కానీ తన నియోజకవర్గమైన నర్సాపురంలో మాత్రం ఆయన తనముఖ్య అనుచరులను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు. రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ నేతలు లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకూ దీనిపై స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో ఆయన స్పీకర్ కార్యాలయంతో టచ్ లో ఉండేందుకే ఢిల్లీ వదలి రావడం లేదని చెబుతున్నారు. దీంతో పాటు భద్రతపరమైన సమస్యలు కూడా రఘురామ కృష్ణంరాజు కు ఉన్నాయి. ఆయనకు ఇప్పటికే కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. తనకు వైసీపీ క్యాడర్ నుంచి ముప్పు ఉందని రఘురామ కృష్ణంరాజు కేంద్ర బలగాల రక్షణను కోరారు.ఈ పరిస్థితుల్లో రఘురామ కృష్ణంరాజు మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. రోజూ రచ్చ బండ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అయితే నర్సాపురంలో రఘురామ కృష్ణంరాజుపై కొన్ని కేసులు నమోదయ్యాయి. తన అనర్హత పిటీషన్ పై క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే రఘురామ కృష్ణంరాజు నర్సాపురం నియోజకవర్గంలోకి అడుగుపెడతారంటున్నారు.