కర్నూలు, నవంబర్ 12,
భూమా నాగిరెడ్డి దంపతులు మృతి చెందిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కులేకుండా పోయారు. అంతా అఖిలప్రియ చూసుకుంటున్నారు. కానీ అఖిలప్రియ వేస్తున్న అడుగులు భూమా కుటుంబాన్ని రాజకీయంగా మరింత దిగజార్చే విధంగా ఉన్నాయి. భూమా నాగిరెడ్డి ఉన్నంత వరకూ క్యాడర్, కుటుంబం అంతా ఒక్కటిగా ఉండేది. కానీ అఖిలప్రియ జామానాలో రెండూ తనంతట తానే విచ్ఛిన్నం చేసుకుంటుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.భూమా నాగిరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేకమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా భూమా కుటుంబమే సింబల్ గా ఆయన సత్తాను చాటుకున్నారు. అలాంటి భూమా కుటుంబం అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్రమంగా అన్నింటా పట్టుకోల్పోతుంది. ఎన్నికల్లో ఓటమిని పక్కన పెడితే కనీసం తన తండ్రి సహచరులను, కుటుంబ సభ్యులను కూడా తనంతట తానే దూరం చేసుకుంటుంది.భూమానాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి ని అఖిలప్రియ దూరం చేసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ వ్యూహాలను రచించడంలోనూ, క్యాడర్ ను క్షేత్రస్థాయిలో మొహరించడంలోనూ దిట్ట. ఆయనను తనంతట తానే దూరం చేసుకోవడంతో గత ఎన్నికల్లో అఖిలప్రియ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక కుటుంబసభ్యులను కూడా అఖిలప్రియ పట్టించుకోవడం లేదు. దీంతో అఖిలప్రియ సోదరుడు బీజేపీలోకి వెళ్లిపోయారు.తాజాగా విజయ మిల్క్ డైరీ ఛైర్మన్ పదవి కోసం అఖిలప్రియ ఇంట మరో వివాదం చెలరేగింది. తన తండ్రి పినతండ్రి భూమా నారాయణరెడ్డి ని ఛైర్మన్ పదవి నుంచి తప్పించడానికి అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు ప్రయత్నించారు. దీంతో భూమా నారాయణరెడ్డి వారిపై కేసు నమోదు చేశారు. తన తాత వరసైన ఆయనను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలను భూమా కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది అఖిలప్రియకు రాజకీయంగా భవిష్యత్ లోనూ ఇబ్బంది అవుతుందంటున్నారు. మొత్తం మీద అఖిలప్రియ తన చేజేతులా చేసుకుంటున్నారన్న టాక్ ఆళ్లగడ్డలో బలంగా విన్పిస్తుంది.