శ్రీకాకుళం, నవంబర్ 12, పదవి ఉంటే ఆటోమేటిక్ గా ఆ మనిషి ముఖంలో కళ కడుతుంది. జోరు చేస్తారు, హుషార్ గా కూడా ఉంటారు. కానీ పదవి తీసేస్తే మాత్రం ఒక్కసారిగా రిటైర్ అయిపోయినట్లుగా ఫీల్ అయి రిలాక్స్ అయిపోతారు. ఇపుడు ఆ పొజిషన్లో ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. ఆయన తీసేసిన తాశీల్దారు అయిపోయారు. పైగా గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇపుడు ఆయన వట్టి పొలిట్ బ్యూరో సభ్యుడు గా మాత్రమే ఉన్నారు. అంతకు మించి ఏ హోదా లేదు. దాంతో సైలెంట్ అయిపోయారు.కింజరాపు కుటుంబంలో కళా వెంకటరావు కు ఎపుడూ గ్యాప్ ఉంటూ వచ్చింది. ఇద్దరూ ఒకేసారి టీడీపీలోకి వచ్చినా కూడా ఎర్రన్నాయుడు కంటే కూడా ఒక దశలో ఎక్కువ పదవులు తీసుకున్నది కళా వెంకటరావే అని చెప్పాలి. ఆయన హోం మంత్రిగా యువకుడిగా ఉన్నపుడే అయ్యారు. అప్పటికి ఎర్రన్నాయుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఇక కళా వెంకటరావు దగ్గుబాటి గ్రూప్ లో ఉండేవారు అంటారు. చంద్రబాబు వైపున ఎర్రన్నాయుడు ఉంటూ వచ్చారు. 1995 తరువాత ఎర్రన్న హవా ఒక్కసారిగా పరుగులు తీయడంతో కళా వెంకటరావు కొంత వెనకబడ్డారు. అలా అది కొనసాగి చివరికి సీనియర్ మోస్ట్ నేత అయి కూడా కళా వెంకటరావు జిల్లాలో పట్టు సంపాదించలేకపోయారు.ఇపుడు కింజరాపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడుని ఏరి కోరి మరీ బాబు కొత్త ప్రెసిడెంట్ చేశారు. ఇప్పటికే అచ్చెన్న అసెంబ్లీలో టీడీపీకి ఉప నాయకుడు. రామ్మోహననాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఎర్రన్న కూతురు రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే. మొత్తానికి కింజరాపు కుటుంబం మొత్తం దూసుకు రాజకీయంగా ఆధిపత్యం చేస్తోంది. అదే కళా వెంకటరావు వర్గానికి తట్టుకోలేనిదిగా ఉందని అంటున్నారు. కళాకు పెదబాబు కంటే చినబాబు లోకేష్ దగ్గరే పలుకుబడి ఎక్కువ. లోకేష్ తో చెప్పించి ఎలాగైనా అచ్చెన్న ఏపీ ప్రెసిడెంట్ కాకుండా చేయాలని చూసినా ఫలితం లేకపోయిందని చెబుతారు. లోకేష్ ని సైతం పక్కన పెట్టి బాబు అచ్చెన్నకు కిరీటం పెట్టారు. దాంతో కళా వెంకటరావు ఇపుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు.చిత్రంగా కళా వెంకటరావు కు వైసీపీలో మద్దతు దక్కుతోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం కళాకు మద్దతు ఇస్తున్నారు. ఆయన బీసీ నేత కాడా, మరి ఆయన్ని తీసేసి అచ్చెన్నకు ఇచ్చి చంద్రబాబు బీసీలకు ఏం సందేశం ఇచ్చారు అని తమ్మినేని ఈ మధ్యనే గట్టిగా విరుచుకు పడ్డారు. ఇక టీడీపీలో ఉన్న కాలంలో కూడా తమ్మినేని కళా వెంకటరావు ఒక్కటిగా ఉంటూ కింజరాపు ఎర్రన్నాయుడు మీద పోరాడేవారు. 2008 సమయంలో ఈ ఇద్దరు నేతలు ప్రజారాజ్యంలోకి కూడా కలసే వెళ్లారు. ఆ తరువాత కళా తిరిగి సొంత గూటికి చేరినా తమ్మినేని వైసీపీని ఎంచుకున్నారు. మరిపుడు కళా వెంకటరావు కు టీడీపీలో గత వైభవం లేకపోవడంతో ఆయన ఏమైనా వైసీపీ వైపు చూస్తారా. మిత్రుడు దానికి సాయం చేస్తాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా కళా మాటా మంతీ లేకుండా గమ్మున ఉండడం మాత్రం టీడీపీ రాజకీయాల్లో చర్చగా ఉంది.