బ్రిటన్‌లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీ గురించి ఆ దేశ ప్రధాని థెరిసా మే వద్ద మోదీ ప్రస్తావించినట్టు అధికారులు తెలిపారు. న్యాయపరమైన అంశాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ థెరెసా మే అధికారిక నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాల్యా, లలిత్ మోదీను భారత్‌కు అప్పగించడంలో సహకరించాలని మోదీ బ్రిటన్ ప్రధానిని కోరినట్టు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత అయిన మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.9,000కోట్లు రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన 2016మార్చిలోనే భారత్‌నుంచి పారిపోయి వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారు. అప్పుడప్పుడూ అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్‌లనూ వీక్షించడానికి స్టేడియాలకు వస్తుంటారు.అయితే అప్పుడే భారత్ మాల్యా విషయాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రుణ ఎగవేత కేసులో మాల్యాను అక్కడి పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటికొచ్చారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మరో రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.బ్రిటన్ ప్రజలకు లబ్ధి చేకూరేలా ఇరు దేశాలు పనిచేస్తాయని సమావేశం అనంతరం మాట్లాడిన థెరిసా మే వెల్లడించారు. తాజా భేటీతో ఇరు దేశాల సంబంధాల్లో నూతనోత్తేజం నెలకొందని ప్రధాని మోదీ అన్నారు. మేతో చర్చల అనంతరం ప్రిన్స్ చార్లెస్‌తోనూ మోదీ భేటీ అయ్యారు.