YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో ప్రతిపక్ష స్థాయికి బీజేపీ

తెలంగాణలో ప్రతిపక్ష స్థాయికి బీజేపీ

హైద్రాబాద్, నవంబర్ 12,
 ఉప ఎన్నికలు రెండు పీడకలలు తీసుకొచ్చాయి. ఒకటి అధికార పార్టీ గర్వభంగం చేసిన పీడకల కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పాత్రను పరిసమాప్తి చేసిన పీడకల మరొకటి. అటు టీఆర్ ఎస్ కు, ఇటు కాంగ్రెస్‌కి చాలా కాలం మర్చిపోలేని దెబ్బను ఈ ఉపఎన్నిక ముద్రించిపోయింది. రఘునందన్‌రావు విజయంతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. కమలదళంలో ఫుల్‌జోష్‌ కనిపించగా.... టీఆర్‌ఎస్‌ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ... విజయం బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటరు టీఆర్‌ఎస్‌కు షాకిచ్చాడు.  తొలిసారిగా మంత్రి హరీష్ రావు దుబ్బాకలో పార్టీకి విజయం అందించలేకపోయారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తాలూకు సానుభూతి, అధికారపార్టీకి ఉండే అనుకూలత... ఇవేవీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను గట్టెక్కించలేకపోయాయి. గతంలో వరుస ఓటములు చవిచూసిన రఘునందన్‌రావు ఎట్టకేలకు ప్రతిష్టాత్మక పోరులో విజయతీరాన్ని చేరారు. లక్ష ఓట్ల మెజారిటీ తప్పదనుకున్నచోట ఇది హరీష్ రావుకు వ్యక్తిగతంగా తీవ్ర పరాభవాన్ని మిగిలించగా కేటీఆర్‌తో సహా నాయకులందరికీ షాక్ తగిలింది. ప్రతిపక్షమంటే కనీస గౌరవం లేకుండా తూలనాడిన తెరాస నేతలు చివరి రౌండులో ఫలితం చూడగానే ముఖం చాటేసిన అరుదైన ఘటనకు దుబ్బాక ఉపఎన్నికల సాక్షీభూతమై నిలిచింది.  ఈ ఉపఎన్నికలో అధికార పార్టీకి ఎంత దెబ్బతగిలిందో ప్రతిపక్షమైన  కాంగ్రెస్‌కు ఇంకా ఘోరమైన అవమానాన్ని మిగిల్చింది. పేరుకు మూడో స్థానంలో నిలిచిందనుకున్నప్పటికీ డిపాజిట్ కోల్పోవడం కంటే మించిన అవమానం కాంగ్రెస్‌కి కలిగింది. పోటీలో నిలిచి గెలిచిన బీజేపీకి, ఓడిన తెరాసకి వెయ్యి ఓట్ల తేడాతో సరిసమానంగా ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కోల్పోయే సంఖ్య ఓట్లను మాత్రమే రావడం విశేషం. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఉన్న నియోజకవర్గంలో 1,98,807 ఓట్లకు గాను.. 1,64,192 మంది ఓటర్లు నేరుగా ఓటు హక్కును వినియోగించుకోగా... పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1,453 మంది ఓటు హక్కును వినియోగించకున్నారు.  బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 3,489 ఓట్లు వచ్చాయిదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై అందరి అంచనాలు తారుమారయ్యాయి. 3వ తేదీన ఎన్నిక ముగిసిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఈ ఫలితాలపైనే చర్చ సాగింది. కొన్ని ఎగ్జిట్‌పోల్స్‌ బీజేపీకి అనుకూలంగా రాగా... మరికొన్ని టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పాయి. ముందుగా 30, 40 వేల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ... క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులు, యువత ప్రభావం జయాపజయాలను తారుమారు చేశాయి. ఎవరునెగ్గినా సుమారు 10 వేల ఓట్లతోనేనని బెట్టింగ్‌లు కూడా కాశారు. చివరకు 1,079 ఓట్ల మెజారిటీ బీజేపీ గెలిచి అందరి అంచనాలను తారుమారు చేసింది. ఫలితాలు ఇంతగా తారుమారు కావడం తెలంగాణలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు.
మట్టికరిచిన కాంగ్రెస్‌ వ్యూహం..
ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధికార తెరాస కంటే మించిన హంగామాను ప్రదర్శించింది. ఇదే తనకు చివరి ఎన్నిక అన్నట్లుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముఖ్య నాయకులను దుబ్బాక నియోజకవర్గంలో మోహరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. దుబ్బాకలో రెండు రోజులు మకాం పెట్టి మరీ దిశానిర్దేశం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఇతర హేమాహేమీలంతా మండలాలు, గ్రామాలను పంచుకొని ప్రచారం చేశారు. గెలుపు ఓటమిల విషయం పక్కన పెట్టినా... గత ఎన్నికల్లో వచ్చిన ఓట్‌లైనా సాధించి రెండో స్థానాన్ని పదిలపరుచుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. గత ఎన్నికల్లో 26,691 ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈ దఫా 22,196 ఓట్లతో డిపాజిట్‌ను కోల్పోయింది.ఉప ఎన్నికలకు రెండు రోజులముందు కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతిపక్షాన్ని లేకుండా చేశానని విర్రవీగిన తెరాసకు ఏకు మేకులా బీజేపీ తయారైందని, తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని విజయశాంతి  నర్మగర్భంగా వదిలిన మాటలు తెరాస ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టాయి.

Related Posts