YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ వైపు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

బీజేపీ వైపు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

హైద్రాబాద్, నవంబర్ 12, 
దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాలు అధికార టీఆర్ ఎస్‌ను కంగుతినేలా చేస్తే.. కాంగ్రెస్ పార్టీని మాత్రం చావుదెబ్బ కొట్టాయి. ఆ పార్టీ శ్రేణుల‌ను తీవ్ర కుంగుబాటుకు గురిచేశాయి. కాంగ్రెస్ పార్టీలోని కీల‌క నేత‌లంతా దుబ్బాక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. స్థానికంగా మంచిపేరున్న‌, క్యాడ‌ర్ ఉన్న నేత‌ను బ‌రిలోకి దింపారు. అయినా డిపాజిట్లు కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంత‌ చావుదెబ్బ‌తిన‌డానికి కార‌ణాలు అనేకం ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల‌తో త‌లోనిర్ణ‌యం తీసుకోవ‌టం ద్వారా ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫ‌లితం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. రాష్ట్ర పార్టీలోని కీల‌క నేత‌ల మ‌ధ్య విబేధాల వ‌ల్ల‌నే ఇలాంటి ఫ‌లితం వ‌చ్చింద‌ని, వీరు ఇక మార‌రా అంటూ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే త‌మ‌కు భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నేత‌లు ప‌లువురు బీజేపీ, టీఆర్ ఎస్‌వైపు చూస్తున్న‌ట్లు కూడా తెలుస్తోంది. ఇంత‌లా కాంగ్రెస్ దిగ‌జారిపోతున్నా స‌రియైన టీపీసీసీ చీఫ్‌ను నియ‌మించ‌డంలో కేంద్ర పార్టీ అధిష్టానం ఎందుకు నిర్ల‌క్ష్యం చేస్తుందో అర్థంకాక ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌ను మెరుగైన స్థితికి తీసుకురావాలంటే దూకుడు క‌లిగిన నేత‌కు టీపీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీ శ్రేణుల నుండి డిమాండ్ పెరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నాటి వ‌ర‌కైన టీపీసీసీ అధ్య‌క్షుడ్ని మార్చ‌క‌పోతే ఆ ఎన్నిక‌ల్లోనూ దుబ్బాక ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు పున‌రావృతం అవుతాయ‌నే వాద‌న పార్టీ శ్రేణుల వాద‌న‌. ఈ క్ర‌మంలో అధిక‌శాతం మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపిక చేయాల‌ని స్థానికంగా ఉన్న నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి దూకుడు స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తి అని, అలాంటి స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తి అధ్య‌క్షుడిగా ఉంటేనే కాంగ్రెస్ రాష్ట్రంలో తిరిగి కోలుకొనే ప‌రిస్థితి ఉంటుంద‌ని, అంద‌రూ రేవంత్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని జిల్లాల్లోని కీల‌క‌ నేత‌ల‌పై కార్య‌క‌ర్త‌లు ఒత్తిడి తెస్తున్న‌ట్లు పార్టీలో చ‌ర్చ‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. రేవంత్‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. దీనికితోడు అధికార తెరాస‌ను ప్ర‌తీ అంశంలోనూ ఇరుకున పెట్టేందుకు రేవంత్ కృషిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో  రేవంత్‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌తో పాటు, తెరాస వ్య‌తిరేఖ ఓటుబ్యాంకుసైతం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుంద‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. మ‌రి అధిష్టానం తెలంగాణ పార్టీ ప‌రిస్థితిపై దృష్టిసారించి రేవంత్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తుందా..? ఇంకొన్నాళ్లు వేచి చూస్తుందా  అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Posts