YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలానికి దగ్గరవుతున్న రాములమ్మ

కమలానికి దగ్గరవుతున్న రాములమ్మ

హైద్రాబాద్, నవంబర్ 12, 
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని రెండుకు పెంచుకుంది. ఈ విజయం తెలంగాణ బీజేపీలో నూతనోత్తేజాన్ని నింపింది. బీజేపీ విజయాన్ని అందుకుంది.. టీఆర్ఎస్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరికి ఎటువంటి పోటీ ఇవ్వని పార్టీ ఏమిటంటే అది కాంగ్రెస్ పార్టీనే..! టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో కనీసం ప్రభావం చూపించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే తమ నాయకుల మీద ఆగ్రహం పెల్లుబికింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలంలో ఉత్తమ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. దుబ్బాక ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని వారు మండిపడ్డారు.కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈనెల 14న ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో ఆమె చేరుతున్నట్టు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో ఆమె భేటీ అయ్యారు. దుబ్బాకలో కాంగ్రెస్ తరపున ఆమె ప్రచారం కూడా నిర్వహించకపోవడంతో బీజేపీలో చేరడానికే ఆమె ఢిల్లీకి వెళ్ళబోతున్నారని అంటున్నారు. దుబ్బాక ఉపఎన్నిక  విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు, కేసీఆర్ దొర నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని అభివర్ణించారు. ఏదేమైనా దొర ఆధిపత్య, దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరిలూదారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. చైతన్యపూరితమైన తెలంగాణలో, భవిష్యత్ లో జరిగే పోరాటాల్లో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని వ్యాఖ్యానించారు.
అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు లొంగలేదని, పాలకులపై గూడుకట్టుకున్న వ్యతిరేకతను తమ ఓట్ల రూపంలో స్పష్టం చేశారని వెల్లడించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం అన్నారని.. బీజేపీ, కాంగ్రెస్ లకు కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా అని వ్యాఖ్యానించారు. చివరికి, ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనని అన్నారు. లక్ష మెజారిటీ వస్తుందని చెప్పి, ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి కొద్ది వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండని టీఆర్ఎస్ కు హితవు పలికారు రాములమ్మ.

Related Posts