YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ ఆరు మండలాల్లో నీటికి కటకటే

ఆ ఆరు మండలాల్లో నీటికి కటకటే

జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మాత్రం నీటిమట్టాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా ఆ ఆయకట్టుల పరిధిలో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. మరోవైపు ఎక్కడ మిషన్‌భగీరథకు నీళ్లు సరిపోక ఇబ్బంది ఎదురవుతుందోనన్న భయంతో పొలాలకు సాగునీరివ్వకుండా మన పాలకులు ఆపేశారు. మిషన్‌ భగీరథ నీళ్ల్లు వస్తాయని అధికారులు వేసవిలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. దీంతో ఇటు మిషన్‌భగీరథ రాకపోవడం, అటు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో పల్లెలు దాహార్తితో అలమటిస్తున్నాయి. పైపులైన్లు, ఫిల్టర్‌బెడ్ల నిర్మాణం పూర్తయినా సమయానికి వరదలు రాకుంటే మిషన్‌రన్‌ గగనమే. రామన్‌పాడు పథకం ద్వారా నీళ్లందే 320 గ్రామాలకు భగీరథ వస్తుందనే సాకుతో నిలిపేశారు. ఎల్లూరు గ్రామ శివారులోని కోతిగుండు ప్రాంతానికి వరద జలాలు వస్తేనే భగీరథ నీళ్ల పంపింగ్‌కు అవకాశాలుంటాయి. అక్కడ నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ తగిన నీరు రావడం లేదు. పూడికను తీస్తే ఆశించిన స్థాయిలో నీరు వచ్చే అవకాశాలున్నాయి. గతేడాదిలాగే వరదలు రావటం ఆలస్యమైతే జనవరి దాకా మిషన్‌ ఆగిపోయే ప్రమాదముంది. శ్రీశైలంలోకి వరద నీరొస్తే.. పాలమూరు-రంగారెడ్డి పథకానికి ప్రతి రోజూ రెండు టీఎంసీల చొప్పున రెండు నెలలపాటు 120 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. కేఎల్‌ఐకి 40 టీఎంసీలు, భగీరథకు 10 టీఎంసీలు ఇక్కడి నుంచే సరఫరా చేయాల్సి ఉంది. అంతేకాదు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 320 గ్రామాలకు నీళ్లందించే రామన్‌పాడు పథకాన్నీ నిలిపిశారు. ఇక ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని 86 మండలాలకు, 3200 గ్రామాలకు మిషన్‌ భగీరథ లక్ష్యంగా సర్కారు చెబుతున్నా.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ తాగునీరందించడం కష్టమే.జూరాల ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలు వరి సాగుచేశారు. వరి చేతికందే దశలో నీటి విడుదల ఆపేశారు. మిషన్‌ భగీరథ వస్తుందని, ఇప్పుడు నీళ్లు అయిపోతే తర్వాత మిషన్‌కు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. జోగులాంబ గద్వాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అధికారులు వారబంధీ నిబంధన పెట్టారు. దీనిప్రకారం ఒక వారం నీళ్లు వదులుతూ.. మరో వారం నిలిపేస్తున్నారు. 15 రోజులు ఇలాగే కొనసాగితే పంటలు ఎండుతాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే సగం పంట ఎండిపోయే ప్రమాదముంది. గతేడాది ఈ సమయానికి జూరాల ప్రాజెక్టులో 4.5 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. ఇప్పుడేమో 3.1 టీఎంసీలు నీరు మాత్రమే ఉన్నది. 2 టీఎంసీలు ప్రాజెక్టు అడుగులోతునే ఉంటుంది కాబట్టి.. పైకి నీళ్లు వదిలిపెట్టినా రావు. వాడుకోవాల్సింది 1టీఎంసీ మాత్రమే. అందువల్ల కర్ణాటక రాష్ట్రం నుంచి విడుదల చేయాల్సిన జలాలు రాకపోతే తాగు, సాగునీటికి ముప్పు ఉన్నట్టే. గతేడాది నీటి ఎద్దడిని ముందస్తుగానే గుర్తించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 357 గ్రామాలకు రూ.116.58 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 25 గ్రామాల్లో రూ.37.96 కోట్లు, వనపర్తి జిల్లాలో 240 గ్రామాలకు రూ.181.67 కోట్లు కేటాయించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 221 గ్రామాలకు రూ. 229 కోట్లు కెేటాయించి ఖర్చు చేశారు. ఈ ఏడాది ఎండలు ముదురుతున్నా తాగునీటి ఏర్పాట్లను చేయడం లేదు. దీంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వ్యవసాయ పొలాల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో నల్లమల్ల, గట్టు, నారాయణపేట, బిజినపల్లి, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. బిజినపల్లి మండలంలో 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌, తెలకపల్లిలలోనూ ఇదే పరిస్థితి. అమరచింత, ఆత్మకూర్‌ మండల కేంద్రాలకు జూరాల ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తాగునీటి కటకట తీరట్లేదు.

Related Posts