కాకినాడ, నవంబర్ 13,
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? జరిగితే.. ఎవరు పుంజుకుంటారు ? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాజకీయం చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది స్థానిక ఎన్నికలు ప్రారంభమై.. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా జరిగిపోయి.. అర్ధాంతరంగా కరోనా ఎఫెక్ట్‌తో ఆగిపోయాయి. అప్పట్లో చాలా చోట్ల.. వైసీపీ ఏకపక్షంగా పుంజుకుంది. ఇక, టీడీపీ తరఫున నిలబడే నాయకులు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీకి ఏకగ్రీవాలు పెరిగిపోయాయి. ఇక, ఎన్నికలు ఆగిపోవడం.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం.. తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే.ఇక, ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల విషయం తెరమీదికి వచ్చింది. కరోనా తగ్గుముఖం పడుతుండడంతోపాటు.. సుప్రీం కోర్టు కూడా ఎన్నాళ్లని ఎన్నికలు ఆపుతారంటూ.. కేంద్రాన్ని నిలదీయడంతో బిహార్ అసెంబ్లీ సహా అనేక చోట్ల ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనూ స్థానిక ఎన్నిలు నిర్వహించేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అభిప్రాయం కూడా కోరింది. ఈ క్రమంలోనే.. ఆయన ఆల్ పార్టీ మీటింగ్ కండెక్ట్ చేసి.. వారి అభిప్రాయాలు సేకరించారు. దీనిని కోర్టుకు కూడా అందించారు. ఎన్నికలు నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని కూడా చెప్పారు.అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధంగా లేదు. తమకు నచ్చని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆ సీటును ఖాళీ చేసేవరకు జగన్ ఎన్నికలపై ఆసక్తి లేనట్టుగానే ఉంటున్నారు. అంటే.. ఆయన రిటైర్ అయ్యేందుకు మార్చి వరకు సమయం ఉందికాబట్టి.. అప్పటి వరకు వాయిదా వేయించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇలా చేయడం వల్ల వైసీపీకే ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఆదిలో ప్రజల్లో ఉన్న సానుకూలత ఇప్పుడు వైసీపీ సర్కారుపై లేకుండా పోయిందని చెబుతున్నారు. పోలవరం విషయంలోను, తెలంగాణతో రగడతో చేతులు ఎత్తేయడం, అమరావతి ఆగిపోవడం, మూడు రాజధానుల విషయం, ఇలా అనేక విషయాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.మరీముఖ్యంగా తమకు పింఛన్లు పెంచుతామని చెప్పి కూడా పెంచలేదని అవ్వతాతలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మున్ముందు.. ఈ అసంతృప్తి మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం టీడీపీ పుంజుకుంటోంది. ఉద్యమాలు చేయడంలోను, ప్రభుత్వాన్ని నిలదీయడంలోను టీడీపీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు కూడా నాయకులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ సీట్లను సైతం టీడీపీ తన ఖాతాలో వేసుకునే అవకాశం కూడా కనిపిస్తోందని అంటున్నారు.రాయలసీమలో వైసీపీ పట్టు సడలకపోయినా రాజధాని రెండు జిల్లాలతో పాటు గోదావరి జల్లాల్లోనూ వైసీపీకి కొన్ని చోట్ల అయినా ఎదురు దెబ్బలు తప్పేలా లేవు. అదే మార్చిలో ఎన్నికలు జరిగిపోయి ఉంటే వైసీపీ రాష్ట్రం అంతటా 95 – 98 శాతం సీట్లతో విజయంతో స్వీప్ చేసి ఉండేది. ఇప్పుడు కూడా వైసీపీ విజయం సాధించినా టీడీపీకి వచ్చే ఓట్ల శాతంతో పాటు కాసిన్ని సీట్లు అయితే పెరుగుతాయి. మొత్తంగా ఎన్నికలు ఎంత ఆలస్యమైతే.. అంత వైసీపీకి ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.