హైద్రాబాద్, నవంబర్ 13,
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే ఆయన అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఆందోళనకు గురయ్యారు. ‘ఆచార్య’ షూటింగ్‌ను మొదలుట్టాల్సిన సమయంలో చిరంజీవికి కరోనా సోకడం చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు, ఆయన ఇటీవల నాగార్జునతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కవలడంతో మరింత గోలగోల అయిపోయింది. అయితే, చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు సినీ పరిశ్రమకు చెందినవారు ఆ భగవంతుడిని ప్రార్థించారు. మొత్తానికి చిరుకి కొవిడ్ నెగిటివ్ అని తేలింది.నిజం చెప్పాలంటే చిరంజీవికి అసలు కరోనానే సోకలేదు. ఫాల్టీ టెస్టింగ్ కిట్ వల్ల ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా గురువారం సాయంత్రం వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి తాను మూడు చోట్ల కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఆ మూడు చోట్ల నెగిటివ్ అని తేలిందని చిరు స్పష్టం చేశారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు.కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్‌ఫ్యూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరవాత, బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి నాకే అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్‌ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ఇబ్బంది లేదన్న నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగిటివ్ వచ్చాక.. మరొక్కసారి మరోచోట నివృత్తి చేసుకుందామని నేను టెనెట్ ల్యాబ్‌లో ౩ రకాల కిట్లతో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగెటివ్ వచ్చింది. చివరిగా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా ఆర్టీ పీటీఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తరవాత మొదటి రిపోర్ట్ తప్పుడు కిట్ వలన వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకి వచ్చారు. ఈ సమయంలో మీరందరు చూపించిన ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.