న్యూ ఢిల్లీ నవంబర్ 13
తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికైన వారం రోజుల తర్వాత డ్రాగన్ దేశం చైనా.. బైడెన్‌కు శుభాకాంక్షల సందేశాన్ని వినిపించింది. ఇటీవల అమెరికా, చైనా మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ వైఖరి వల్ల ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బైడెన్ ఎన్నికపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వెన్‌బిన్ ఇవాళ స్పందించారు. అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని, బైడెన్, కమలా హ్యారిస్‌లకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు వాంగ్ బెన్‌బిన్ తెలిపారు. అమెరికా ఎన్నికల ఫలితాలు.. ఆ దేశ ఎన్నికల చట్టాలకు లోబడే ఉంటాయని భావిస్తున్నట్లు చైనా అధికారి తెలిపారు. అమెరికా, చైనా మధ్య గత కొన్నాళ్ల నుంచి వాణిజ్య యుద్ధం నడుస్తోంది. కోవిడ్ మహమ్మారికి చైనానే కారణమంటూ ట్రంప్ ఆరోపించారు. హాంగ్ కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు కూడా చైనానే కారణమని ఆరోపణలు ఉన్నాయి. చైనాతో ప్రపంచ దేశాలకు ప్రమాదం ఉందని కూడా ట్రంప్ హెచ్చరించారు.