YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీపీఎంలో అతివాదులు వర్సెస్ మితవాదులు

సీపీఎంలో అతివాదులు వర్సెస్ మితవాదులు

సీపీఎం పార్టీలో అంతర్గత గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి.  సీతారాం ఏచూరి రాజకీయ ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టకుండా పార్టీ కేంద్రకమిటీ అడ్డుకుంది. రాజకీయ ము సాయిదా తీర్మానాన్ని ప్రధాన కార్యదర్శి కాకుం డా మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ప్రకాశ్ కరత్ మహాసభలలో ప్రవేశపెట్టారు. పార్టీ మహాసభల సందర్భంగా ఆమోదించే రాజకీయ ముసాయిదా తీర్మానం అత్యంత కీలకమైనది. వచ్చే మూడేళ్లలో పార్టీ రాజకీయ సరళి, తీసుకోబోయే రాజకీయ నిర్ణయాల ఖరారులో ఈ ముసాయిదా కీలక భూమిక వహిస్తుంది. ఇది ఆమోదం పొందితే పార్టీ కార్యాచరణకు ఆయువుపట్టు అవుతుంది. పార్టీ మహాసభలలో అత్యంత కీలకమైన ముసాయిదా పత్రాలలో ఈ రాజకీయ తీర్మానం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రతిసారి దీనిని పార్టీ ప్రధాన కార్యదర్శి దీనిని సమర్పిస్తారు. అయితే ఈసారి దీనిని ప్రధాన కార్యదర్శి దీనిని సమర్పించేందుకు మహాసభ అనుమతించలేదు. ఇది అసాధారణమేనని ఇంతకు ముందెప్పుడూ జరగలేదని పార్టీ వర్గాలు నిర్థారించాయి. ప్రధాన కార్యదర్శి కాకుండా ఇతరులు దీనిని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అనుసరించే రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉండాలనే అంశాన్ని రాజకీయ ముసాయిదాలో ప్రధానంగా ప్రస్తావించారు. బిజెపిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రజాస్వామిక లౌకిక పార్టీలతో సిపిఎం చేతులు కలపాలా? వద్దా ? అనే అంశం ఈ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండరాదని పార్టీలోని కరత్ వర్గం వాదిస్తోంది. కానీ ఏచూరి వర్గం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని, అప్పుడే బిజెపిని ధైర్యంగా ఎదుర్కోవడం జరుగుతుందని విశ్వసిస్తోంది. త్రిపురలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం నాయకత్వపు వామపక్ష కూటమి దెబ్బతిన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని ఏచూరి మద్దతుదార్లు భావిస్తున్నారు. కానీ కరత్ వర్గం దీనికి ససేమిరా అన్నట్లు వెల్లడైంది. ఏకంగా ప్రధాన కార్యదర్శి రాజకీయ ముసాయిదా తీసుకురావడానికి అంగీకరించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ప్రతినిధి బృందం నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కరత్ నాయకత్వంలోని అతివాదుల బృందం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో కలిసిసాగాలనేఏచూరి వాదనను ముందుకు వెళ్లనివ్వడం లేదని తేటతెల్లం అయినట్లు సిపిఎం నేత ఒకరు పేరు చెప్పకుండా వెల్లడించారు. అయితే పార్టీ నియమావళి మేరకు ఒక నిర్థిష్ట వైఖరికి ఆమోదం దక్కనట్టయితే, ఆ వైఖరిని అవలంభించే వ్యక్తి కీలక బాధ్యతలలో ఉంటే, వైఫల్యానికి బాధ్యతగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏదీ లేదు. అయితే తమ విధానానికి ఓటమి ఎదురుకావడం నిజంగా ఆయనకు నైతిక అపజయం అవుతుందని మరో ప్రతినిధి తెలిపారు. ఈ పరిస్థితి నిజానికి సదరు వ్యక్తి పార్టీ నాయకత్వ బాద్యతలలో ఉండలేని పరిస్థితికి దారితీస్తుందన్నారు. ఇక బుధవారం అసాధారణ రీతిలో పార్టీలో ప్రధాన కార్యదర్శి కాకుండా మాజీ నేత ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై జరిగే చర్చ తరువాత ఆమోదం గురించి ఓటింగ్ దశకు చేరుకుంటుంది. అయితే అటు కరత్ ఇటు ఏచూరి వర్గీయులు ఎవరికి వారు తమ వాదనలు నెగ్గాలనే ధోరణితోనే ఉన్నందున మహాసభలలో తీర్మాన ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది? ఫలితం ఎటువైపు తిరుగుతుంది? అనేది స్పష్టం కాలేదు. అయితే వేర్వేరు పట్టువీడని వాదనలు ఉన్నప్పటికీ ఇరు పక్షాలకు రాజీ మార్గంగా మధ్యేమార్గం ఉండనే ఉంటుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఇక ఐదు రోజుల పార్టీ సభల సందర్భంగా గురువారం కూడా ఈ ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఓటింగ్‌లో ఏ వాదన నెగ్గుతుందనేది కీలకంగా మారింది. ఇక బుధవారం నాటి సభలలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గత నెలలో పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంలో వీగిపోయిన తమ తీర్మానాన్నే ప్రతిపాదించినట్లు వెల్లడైంది.

Related Posts