న్యూ ఢిల్లీ నవంబర్ 13
ఆఫ్రికా దేశం ఇథియోపియోలోని టైగ్రే ప్రాంతంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. అక్కడ ఉన్న టైగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్(టీపీఎల్ఎఫ్), ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణ తలెత్తింది. టైగ్రే ప్రాంతంలో వందలాది మంది సాధారణ పౌరులు ఊచకోతకు బలైనట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది. టీపీఎల్ఎఫ్ దళాలు ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ దళం మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ప్రభుత్వ దళాలు, టీపీఎల్ఎఫ్ మధ్య గత వారం ఘర్షణ మొదలైంది. ప్రస్తుతం అక్కడ ఫోన్‌లైన్లు, ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇథియోపియాలో అంతర్యుద్ధం మొదలైనట్లు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.ఇథియోపియా ప్రభుత్వానికి, టీపీఎల్ఎఫ్ మధ్య టైగ్రే ప్రాంతంపై చాన్నాళ్ల నుంచి ఉద్రిక్తతలు ఉన్నాయి. అక్కడ తరుచూ మిలిటరీ దాడులు జరుగుతున్నాయి. కొన్ని సమయంలో ప్రభుత్వ దళాలు వైమానిక దాడులకు కూడా పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది సుడాన్‌కు తరలివెళ్లారు. టైగ్రే ప్రాంతంలోని మై కద్రా పట్టణంలో వందల సంఖ్యలో జనాన్ని కత్తితో పొడిచి ఉంటారని లేదా నరికి ఉంటారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే స్థానిక సంక్షోభంతో సంబంధంలేని కార్మికులను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. టైగ్రేలో జరిగిన ఊచకోత అత్యంత దారుణమైన విషాదమని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఆఫ్రికా డైరక్టర్ డిప్రోజ్ ముచేనా తెలిపారు.కత్తులు, కొడవళ్ల లాంటి పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆమ్నెస్టీ తన ప్రకటనలో పేర్కొన్నది. టీపీఎల్ఎఫ్‌తో సంబంధం ఉన్న దళాలు ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. టైగ్రే ప్రాంతంలో ఇటీవల ఓ మిలిటరీ క్యాంపుపై దాడి జరిగిన నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని అబే అహ్మద్ ప్రభుత్వ దళాలకు ఆదేశాలిచ్చారు. దీంతో టైగ్రే ప్రాంతం రక్తసిక్తమవుతున్నది.