అమ్మవారి యొక్క ఆరాధనా ఫలము ఏమిటి...!?
అసలు అమ్మవారు అంటే ఎవరో తెలిస్తే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
మాతృత్వమే అమ్మవారు. మన మాతృమూర్తిలోని అవ్యాజ కరుణ, ఎనలేని మాతృవాత్సల్యం మరియు నిస్వార్థ సేవా ఇత్యాదులన్నీ అమ్మవారే. వందనీయులలో, తండ్రీ, గురువు, మరియూ దైవము కంటే ముందుగా, తల్లినే చెప్పింది శాస్త్రము. అటువంటి వందనీయురాలైన కన్నతల్లిని, జీవించి ఉండగానే స్మశానవాటికలో వదిలి వచ్చే వాడికి, ఓల్డ్ ఏజ్ హోమ్లో విడిచిపెట్టే వాడికి, నరకానికి కూడా ప్రవేశము నిషిద్ధము. అటువంటి వాడు, వాయు శరీరముతో భూతప్రేత పిశాచ రూపములతో అల్లాడవలసినదే. అమ్మవారు జగన్మాత ఎలా అయ్యిందో "ప్రసవిత్రీ" నామము ద్వారా విశ్లేషించారు వశిన్యాది వాగ్దేవతలు శ్రీ లలితా సహస్ర నామములో. మన ఈ జన్మలో మనలను కన్న తల్లులు వేరు కానీ, ఎనుబది నాలుగు లక్షల జీవరాశిని మరియూ సకల భువనములను, కన్నతల్లి మాత్రం అమ్మవారే. మన జన్మ జన్మకీ, తల్లులు మారుతూ ఉన్నారు కానీ, అమ్మవారు మాత్రం మారడం లేదు. అమ్మవారే మన "అమ్మ" అని తెలుసుకునే వరకు, మనకు జన్మ జన్మకీ తల్లులు మారుతూనే ఉంటారు. మన కన్నతల్లి నవమాసాలు మాత్రమే మనల్ని తన గర్భంలో మోస్తుంది. అసలైన తల్లి అమ్మవారు అలా కాదు. అమ్మవారి ఒడిలోనే పుడుతున్నాము, పెరుగుతున్నాము మరియూ లయం అయిపోతున్నాము. అమ్మవారి ఒడి తప్ప మనకు కానీ, లోకాలకు కానీ వేరే ఆధారము లేదు. మరి అమ్మవారికో ..!?, ఏ ఆధారమూ లేదు!!. కనుకనే, "నిరాధారా" అన్న నామం చెప్పారు వశిన్యాది వాగ్దేవతలు. అన్నింటికీ అమ్మవారే ఆధారము, కానీ అమ్మవారికి ఏదీ ఆధారము కాదు. అటువంటి అమ్మకు, శ్రీ కనకదుర్గమ్మకు, నమస్కరించని వాడు, "దౌర్భాగ్యుడు" అన్నారు శంకరులు. కాబట్టి అమ్మవారికి ఎందుకు నమస్కరించాలో అర్థం అయితే, అమ్మవారికి ఎలా నమస్కరించాలో కూడా తెలుసుకోవాలి. అమ్మవారిని త్రికరణములతో నమస్కరించమన్నారు. త్రికరణములు అనగా, మనోవాక్కాయములు. అనగా మనస్సు, వాక్కు, మరియు శరీరము. శరీరముతో సాష్టాంగప్రణామము చేస్తూ, మనస్సు, వాక్కులతో కలిపి నమస్కరించాలి. అటువంటి నమస్కారమునకు అమ్మవారే అర్హురాలు. దేవుళ్ళని వారి వారి పేరుతో నమస్కరిస్తాము. కానీ, అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి, 'అమ్మ'వారు, అక్కడ పేరు లేదు 'అమ్మే' ఉంది. "నేను పొగడకున్న నీకేమి కొదువ రామా..!? " అన్నారు త్యాగరాజు.
అలా మనము నమస్కరించకపోయినా అమ్మవారికి ఏమి కొదువ!? కానీ, అలా అమ్మవారిని ఆరాధించిన విష్ణువుకి మరియు మన్మధుడికి ఎంత లబ్ధిచేకూరిందో విశ్లేషిస్తున్నారు శంకరులు సౌందర్యలహరిలోని ణదవ శ్లోకము ద్వారా, ఈ క్రింది విధముగా
"హరి స్త్వా మారాధ్యా - ప్రణతజన సౌభాగ్య జననీం
పురా నారీభూత్వా - పురరిపు మపి క్షోభ మనయత్
స్మరోపి త్వాం నత్వా - రతినయనలేహ్యేన వపుషా
మునీవా మప్యంతః - ప్రభవతి హి మోహయ మహతామ్".
ఈ శ్లోకము ద్వారా చాలా లోతైన విషయములను చెప్పారు శంకరులు. ఈ శ్లోక అంతరార్ధాన్ని ఎంతో తత్వచింతనతో గ్రహించవలసి ఉంటుంది. మనం ఎవరినైనా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటే, వారు ఇంకా ఎక్కువగా గౌరవించేవారిని చూస్తే, వారు మనకు ఇంకా గౌరవనీయులుగా కనిపిస్తారు. అలా మనం పూజించే ముఖ్య దేవతలు విష్ణువు దత్తాత్రేయుడు మొదలైన వారంతా అమ్మవారినే పూజించారు. అమ్మవారి యొక్క విశిష్టతను మరియు విలక్షణతను అలాగైనా మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఆరాధనలో రెండు ఆచారములు ఉన్నాయి. 1) దక్షిణాచారము, 2) వామాచారము. ఈ రెండు ఆచారములతో పూజించిన వారందరినీ, అమ్మవారు అనుగ్రహించారని వాగ్దేవతలు విశ్లేషణ చేసారు. మనది దక్షిణాచారము. అయితే, వామాచార పద్దతిని విమర్శించుట దోషము. దేని విశిష్టత దానిది. హరి స్త్వా మారాధ్యా - విష్ణువు, శ్రీ విద్యోపాసకులలో ప్రధానమైనవాడు. విష్ణువు, శ్రీ కనకదుర్గా మాత యొక్క కామకళా బీజాన్ని తీసుకొని ఆరాధించారు. "కామకళ" అనే వైదిక శబ్దమునకు అర్థము ఏమంటే, సృష్టి స్థితి మరియు లయ కార్యములకు మూలమైన విద్య. మహోత్కృష్టమైన "కామకళా" శబ్దానికి, నీచమైన భావనలను కానీ, వామాచారంలో చెప్పబడిన భయంకరమైన అర్థములను కానీ స్వీకరించరాదు. అమ్మవారు అనగా మాతృ రూపమును ధరించిన పరబ్రహ్మేయే. శ్రీవిద్యలో ఆ భావన ఎల్లప్పుడు స్పురనలో ఉంచుకోవటం చాలా ప్రధానమైనది. "ఈమ్" కామకళా బీజము. ఆ బీజాన్ని జపించి, "హసకలహ్రీం,హసకహలహ్రీం,సకలహ్రీం" అనే పంచదశాక్షరీ మంత్రముతో అమ్మవారిని ఆరాధించాడు విష్ణువు. దీనినే, "హాదివిద్యా" అంటారు. (పురా నారీభూత్వా, పురరిపు మపి క్షోభ మనయత్) అలా అమ్మవారిని ఆరాధించాడు కాబట్టే, విష్ణువు మోహినీ రూపమును ధరించి,రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచగలిగాడు మరియు సాక్షాత్తూ శివుడినే మోహ పరచగలిగాడు. ఇక మన్మధుడు అయితే, " క-ఏ-ఈ-ల-హ్రీం- హసకహలహ్రీం,సకలహ్రీం" అన్న కాదివిద్యా మంత్రముతో అమ్మవారిని ఆరాధించి ఏమి చేయగలిగాడు అంటే (స్మరోపి త్వాం నత్వా - రతినయనలేహ్యేన వపుషా,మునీవా మప్యంతః - ప్రభవతి హి మోహయ మహతామ్) మునీశ్వరులతో సహా అందరికీ మోహమును కలిగించుటలో సమర్ధుడు అయ్యాడు మరియూ అందరినీ గెలిచాడు. అలా అమ్మవారిని ఆరాధించిన వారికి సకల సౌభాగ్యములు సమకూరుతాయి కనుక,"ప్రణతజన సౌభాగ్య జననీం" అని శంకర ఉవాచ.
ఈ హాదివిద్యా, కాదివిద్యా, వామకేశ్వరతంత్ర గ్రంధములో చెప్పబడ్డాయి. ఈ మంత్రములు, తంత్రములు, ఆచారములు, తెలియని వారికి, మహా మంత్రం ఏమిటంటే, "అమ్మా దుర్గమ్మా" అని తలచటమే మహా మంత్రం. పనిలో ఉన్న తల్లి, పిల్లాడు మామూలుగా, "అమ్మా" అని పిలిస్తే పలకదు, కానీ పిల్లాడు "అమ్మా" అని గట్టిగా పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది పిల్లాడికి ఏమైపోయిందో అని. జగన్మాత అయిన శ్రీ కనకదుర్గా మాతది అదే పద్ధతి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో