YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*జై శ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ*

*జై శ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ*

ఆర్త జన రక్షకుడు, ఆశ్రిత పాలకుడు, భక్తజన వత్సలుడు మరియు అనాథ రక్షకుడైన ఆ పరమాత్మను మోక్ష సాధనకు, మనం శరణాగతి ఏవిధముగా చేయాలో పెద్దలు వివరించారు. వాటిని మనం వివరముగా ఈ క్రింద తెలుసుకుందాం. శ్రీమద్రామాయణము భారతీయులకు పారాయణా గ్రంథము. దీనిని దీర్ఘశరణాగతి అనికూడా కొందరంటారు. “శరణాగతి” అంటే నీవే మాకు దిక్కు. వేరే గతి లేదు రక్షించినా శిక్షించినా నీవే అంటూ, సంపూర్ణముగా తనను తాను భగవంతునికి సమర్పించుకోవడమే. భగవదనుగ్రహం లేకపోతే మోక్షం లభించదు. ఎంత బలమున్నా స్వశక్తితో సాధ్యం కానిదది. ఏ జీవికైనా మోక్షణ గాని రక్షణ గాని కల్పించేది సర్వాంతర్యామియైన శ్రీమహావిష్ణువొక్కడే. మోక్ష సాధన కొరకు సాధారణ జీవులకు ఉపయుక్తమైనది శరణాగతియే. ఇది ఐదు విధాలుగా వుంటుంది.
1. అనుకూల్య సంపాదనం: భగవంతునికి అనుకూలంగా వుండడం. శాస్త్రాలలో నిషేదించినది వదలడం, చేయమన్నది చేయడం. సత్యం వద ధర్మం చర, అహింసాపరమోధర్మః మొదలైన ధర్మాలకు లోబడి ప్రవర్తించడం.
2. ప్రాతికూల్య వర్జనం: భగవంతుడు వద్దన్నది వదిలేయడం . అసత్యమాడక పోవడం, అభజ్యాలను విసర్జించడం మొదలగునవి.
3. అకించిన్యం : మోక్షానికి ఙ్ఞానం భక్తి కర్మలను ఆశింపకుండా భారం భగవంతునిపై వేయడం.
4. మహావిశ్వాసం : పూర్తి ధృఢమైన నమ్మకం. కాపాడుతాడో లేడో అనే అవిశ్వాసం లేకుండా భగవంతుణ్ణి పూర్తీగా నమ్మడం.
5. గోప్తృత్వవర్ణనం : మన రక్షకుడిని ఎన్నుకోవడం. ఇతరులెవరి వల్లా కానిది భగవంతుని వల్ల అవుతుందని ఆయన పాదాలపై పడటం 
వీటికే శరణాగతి అనిపేరు. ఈ ఐదు రకాల శరణాగతులు రామాయణంలో కన్పిస్తాయి. భగవంతుని శరణు కోరేవారు నాలుగు రకాలుగా వుంటారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. 
“ఆర్తో జిఙ్ఞాసుః అర్థార్థి ఙ్ఞానీచ భరతర్షభ చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినోర్జున”
1 ఆర్తుడు: వున్నది పోగొట్టుకొని దేవురించేవాడు.
2అర్థార్థి : లేనిది కోరేవాడు .
3 జిజ్ఞాసు: ఙ్ఞాన రూపమైన స్వరూపాన్ని కోరేవాడు .
జ్ఞాని : పరమాత్ముని శేషత్వమే తన స్వరూపమని ఎంచి తత్ప్రాప్తిని కోరే వాడు . ఈ నలుగురు భగవంతుని శరణు కోరుతారు. రామాయణంలో ఎవరెవరు ఎలాశరణు కోరారో చూద్దాం. 
1. ఇంద్రాది దేవతలు రావణునివల్ల స్థానభ్రంశం పొందారు. రావణుని చంపి తమ స్థానాలిప్పించమని శరణు కోరారు. దేవతల కోరికపై శ్రీమహావిష్ణువు దశరథుని సుతునిగా జన్మించి రావణ సంహారం కావించి వారి కోరిక తీర్చాడు. కాని ఇది లౌకిక సంబంధమైన శరణాగతి. 
2. భరతుడు శ్రీరాముని వద్దకు వచ్చి తిరిగి అయోధ్యకు రమ్మని కోరి శరణాగతుడైనాడు. ఆ కోరిక 14 సంవత్సరాల తరువాత గానీ తీరలేదు. 
3. సుగ్రీవుడు శ్రీరాముని ఆశ్రయించాడు. వాలి బాధ తప్పించమన్నాడు. కోరికైతే కోరాడు కాని రాముడిపై సంపూర్ణ విశ్వాసముంచలేదు. పైగా 7 తాటి చెట్లను కొట్టమన్నాడు. అంతేకాదు తనకు ఉపకారం చేస్తే తిరిగి సాయం చేస్తానంటాడు. అంటే కేవలం వ్యాపార దృష్టితో చేసిన శరణాగతి ఇది. 
4. శ్రీరామచంద్రుడు సముద్రుడిని శరణు కోరాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇమ్మన్నాడు. కాని ఆ కోరిక నెరవేరలేదు. సముద్రుడు ఇవ్వక పోవడం వల్ల బాణాన్ని ప్రయోగించి “నిర్జలం “చేస్తానన్నాడు. ఇక్కడా శరణాగతి అక్కరకు రాలేదు. ఉపాయాంతరాలతో కార్యం సాధించ గలననేవారికి ఇది చెల్లదు. 
5. ఇక ఇందులో బాగా ప్రశంసింపదగిన శరణాగతి అంటే అది విభీషణుని శరణాగతి . ముందు చెప్పిన ఐదు అంశాలతో కూడిన శరణాగతి ఇందులో కన్పిస్తుంది.
1 అనుకూల ప్రవృత్తి : రావణుడు సీతనెత్తుకొచ్చాడు. దాని ఫలితం లంకా దహనం. శత్రువులు యుద్ధసన్నద్ధులై సముద్రానికి అవతల సైన్యంతో విడిది చేశారు. అనవసరంగా శ్రీరామునితో పోరడం మంచిది కాదని అన్నకు హితవు చెప్పాడు విభీషణుడు సీతామాతను తిరిగి ఇచ్చేయమన్నాడు. రావణునికి నచ్చక పోయినా అప్రియమైన సత్యాలు చెప్పాడు.
2. ప్రాతికూల్య వర్ణనం : ఎన్నో రకాలుగా రావణునకు విభీషణుడు హితవాక్యాలు చెప్పినా చెవికెక్కలేదు. రావణుడు కోపంతో “నీవుగాక మరొకరై వుంటే ప్రాణాలుండేవి కావం”టాడు. హితశత్రువని నిందిస్తాడు. ఇన్ని మాటలన్నా అన్నను వదిలి పెట్టి వెళ్తూ “స్వస్తి తేస్తు “అంటూ అన్న శుభం కోరుతూ వెళ్ళి పోతాడు. భగవంతునికి శత్రువైన వాణ్ణి వదిలివేయడం ప్రాతికూల్య నివృత్తి. 
3 మహా విశ్వాసం: అన్నతో విభేదించి అతన్ని వదిలి రాముని చేరుకొన్నాడు విభీషణుడు. శ్రీరాముడు తననుద్ధరిస్తాడనే ప్రబలమైన నమ్మకంతో వచ్చాడు. దానికి కారణం తానే తన సోదరునకి చెప్పిన మాట “సీతను ఇచ్చి శరణు కోరమన్నది” . అంటే శత్రువైన రావణునినే మన్నించే శక్తి గల వాడు తనను ఆదరించడా అని మనసా వాచా నమ్మి రాముని చెంత చేరాడు. ఇదీ మహావిశ్వాసం. 4. అకించిన్యం: సోదరుణ్ణి వదిలేశాక ఎక్కడికెళ్ళాలి అనే ప్రశ్న వచ్చింది. తోడబుట్టినవాడు వెళ్ళగొట్టాడు. రావణుని రాముడు చంపక మానడు. ఆ తరువాత శత్రు శేషముండరాదని వెదికి వెదికి మరీ బంధువులను చంపవచ్చు. . ఇక్కడ కాకపోతే దాగే స్థలము లేదు . రక్షించే వారూ లేరు. కనుక రాముణ్ణి ఆశ్రయిస్తే ఆయన తప్పక రక్షిస్తాడనే నమ్మకం వుంది కనుకే
” పరిత్యక్తా మయా లంకా మిత్రాణిచ ధనానిచ
భవద్గతం హిమే రాజ్యం జీవితంచ సుఖానిచ”
నన్ను రక్షించేవారు మిత్రులూ కారూ, ధనమూ కాదు. ,” నిను వినా రాఘవా “అనే భావంతో వచ్చాడు సత్ఫలితాన్ని పొందాడు. 5. గోప్తృత్వవర్ణనం: విభీషణుడు ఆత్మ సమర్పణం చేసుకొన్నాడు. ఏదో కోరికతో శరణు కోరలేదు. ఉన్న నిజం చెప్పాడు. దుర్మార్గుడైన రావణుని సోదరుడను. అతడు వెళ్ళగొడితే అందరికి శరణమొసగె నిన్ను శరణు కోరాను అని శరణాగతుడవుతాడు. రాజ్యం మీద ఆశతో వచ్చాడేమో అని ఆంజనేయుడంటే అది సరికాదు. అతనికి రాజ్యమే లేదు. “నీ దాసుణ్ణి “అని వచ్చాడు. ఏదైనా మనం కోరితే భగవంతుడు దానిని మాత్రమే ఇస్తాడు. ఏదీ కోరక శరణాగతులైతే అన్నీ ఇస్తాడు. విభీషణుడేమీ కోరకపోయినా రాముడు సముద్రజలాలతో లంకా రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేస్తాడు. అసలు అదింకా రాముని స్వంతం కాలేదు. ఇది సుగ్రీవాదులకు తెలుసు. శరణాగతి కోరడం నేరుగా కాదు. ఎవరో ఒకరిద్వారా కావాలి. అందుకే విభీషణుడు వానరులతో ” నివేదతమాం రామాయ “. అని అంటాడు. సుగ్రీవుడు కూడా ముందు నమ్మడు. మన గుట్టు తెలుసుకోవడానికి వచ్చిన శత్రువీ రావణుని సోదరుడంటాడు. రాముడందరి మాటలు విని చివరకు తన నిర్ణయం “దత్త మస్యాభయం మయా “అంటాడు. శరణు కోరింది విభీషణుడే ఐనా అతని ఆశ్రితులకు రక్షణ దొరికింది. అంటే శరణు కోరితే కోరిన వారికే కాక అతని ఆశ్రితులకు కూడా రక్షణ దొరుకుతుంది. ఇదే సంపూర్ణ శరణాగతి. ఆశ్రిత కల్పవృక్షమైన శ్రీరాముడెటువంటి వాడంటే
“సక్ర్దేవ ప్రపన్నయతవా స్మితీ చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామేత్య ద్వ్రతం మమ”.
ఎవరైనా సరే “నీ వాడను స్వామీ ” అని శరణు కోరితే చాలు. అనుగ్రహించి రక్షించే వాడు. ఇలా సంపూర్ణంగా భారమంతా భగవంతునిపై వేసి “అన్యథా శరణం నాస్తి” అంటూ శరణా గతుడైతే మిగిలిందంతా ఆయనే చూసు కొంటాడు. అందుకే మనమందరం ఆ సర్వాంతర్యామికి శరణాగతులము అవుదాము.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts