విశాఖపట్టణం, నవంబర్ 16,
అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకుల్లో వచ్చే అలకలు, ఆవేదనలు, బుజ్జగింపులు సహజంగా ఉంటాయి. వైసిపి, బిజెపి, టిడిపి, కాంగ్రెస్ ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే పదవులు, పవర్ కోసం జరిగే ప్రాకులాటలే కేంద్రంగా ఈ పార్టీల్లో ఉంటుంది.అయితే ప్రస్తుత రాజకీయ నేతలు పదవులు, వపర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసిపి పరిణామాలను చూస్తే.., తాము ఎమ్మెల్యేలమైనా పవర్ మాత్రం తమ చేతుల్లో లేకపోవడంపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసిపి అధిష్టానం తాత్కాలికంగా సర్దుబాటు చేసినా భవిష్యత్‌లో అసమ్మతి రకరకాల రూపంలో జడలు విప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక అంశాలపై ప్రజాదృష్టితో సంక్షేమ కార్యక్రమాల అమలుపై తమ ప్రభుత్వం స్పష్టతతో ఉంటుందంటూ పదేపదే చెప్పిన ఈ ప్రజాప్రతినిధులు తాజాగా వీధికెక్కడం అంతటా చర్చనీయాంశంగా మారింది.తెలుగుదేశం పార్టీలో మాదిరిగా వైసిపిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పనులు చేసుకునే పరిస్థితులు ఇప్పటివరకూ కనిపించలేదు. మరో వైపు ఆయా అసెంబ్లీ నియోజవకర్గాల్లో పనుల కోసం వచ్చే వారంతా స్థానిక నేతలను గాకుండా ఎంపీ విజయసాయిరెడ్డినే సంప్రదిస్తున్నారన్న ఆవేదన ఈ నేతలను కలచివేస్తుంది. ఆఖరుకు జివిఎంసిలో ఏ చిన్న పని జరగాలన్నా తలపండిన నేత చెప్పాల్సిందేనన్న చర్చ వైసిపిలో బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డిఆర్‌సిలో చోటుచేసుకున్న పరిణామాలు కొంత కలకలానికి తావిచ్చింది. చివరకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం, ఎంపీ విజయసాయిరెడ్డి చొరవతో కొంత సద్దుమణిగినా, అది చల్లారుతుందా? అనే అనుమానాలు లేకపోలేదు. శుక్రవారం సర్క్యూట్ హౌస్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో మాత్రం అంతా ఐక్యతా రాగాన్నే ఆలపించడం విశేషం. వచ్చే స్థానిక ఎన్నికల్లో విశాఖ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇద్దామని అంతా నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు నాయకులు చెబుతున్నారు. 'నాడు నేడు పనులు, భూ ఆక్రమణలు, పార్టీలో కాపు సామాజిక తరగతికి ప్రాధాన్యత తగ్గిపోవడం వంటి కీలకమైన విషయాలపై 'ఇన్‌కెమెరా' మీటింగులో చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ జరుగుతుండగానో మధ్యలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ బయటకొచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 'పార్టీ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవని, డిఆర్‌సి మీటింగులో లేనివి ఉన్నట్లు మీడియా చూపించే ప్రయత్నం చేసిందని చొప్పుకొచ్చారు. అనకాపల్లిలో నాడు నేడు కార్యక్రమం సవ్యంగా లేదని మాత్రమే తాను డిఆర్‌సిలో చెప్పానని తెలిపారు. తాము అమరావతిలో జగన్ దగ్గరకు పంచాయతీకి వెళ్లినట్లు పత్రికలు రాశాయని, అందులో వాస్తవం లేదని చెప్పారు. మొత్తానికి ఏ రాజకీయ వివాదానికైనా కారణాన్ని చివరాఖరున మీడియాపై నెపం తోసేసి అంతా వారివల్లేనని తమలో ఎలాంటి పొరపొచ్చాల్లేవంటూ చెప్పడం రాజకీయాల్లో సర్వసాధారణమే. తాజాగా వైసిపిలో 'పవర్ సెంటర్' ఆందోళనపైనా ఆ పార్టీ నేతలు ఇదే తేల్చారు.తాజాగా జరిగిన సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, అరకు, అనకాపల్లి ఎంపీలు హాజరు కాలేదు. విశాఖ ఎంపీ ఎంవివి, మిగిలిన ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి పోవడం తప్ప స్థిరంగా కూర్చొలేదు. ఈ సమావేశం ముగ్గురికే పరిమితం కావడం చూస్తే అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నమేనని తెలుస్తోంది.ప్రతిపక్షం లేకపోవడంతో పాత్రనూ తామే పోషించామంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పుకొచ్చారు. అయితే నాడు నేడు పనుల్లో అవకతవకలు, అక్రమాలపై కశింకోటలో శుక్రవారం టిడిపి నిరసన చేపట్టింది. వైకాపా నాయకులు జేబులు నింపుకోడానికే స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు, ఉపాధ్యాయులతో కుమ్మక్కయిపోయారంటూ ఆరోపణలు గుప్పించింది. టిడిపికి ఈ ఛాన్స్ దక్కడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చెలరేగిన అసంతృప్తులే కారణమంటూ సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. ఏదిఏమైనా మంచో...చెడో ఒక చర్చ లేదా రచ్చ అధిష్టానంపై జరగడంతో మంచిదే కదా! అనే అభిప్రాయాలూ ఇరు పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నాయి.