రాజమండ్రి, నవంబర్ 16,
పాపికొండల పర్యాటకం ఒక అందమైన జ్ఞాపకం. ఏటా కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండలు పర్యటకులతో నిండిపోయేవి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యటకులతో పోటెత్తేవి. కాని గతేడాది సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి బోటింగ్‌పై నిషేధం కొనసాగుతోంది. ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు స్తంభించాయి. తాజాగా లాక్‌డౌన్ సడలింపు తర్వాత పాపికొండల్లో విహారానికి అవకాశం ఉంటుందని అనేక మంది ఆశాభావంతో ఉన్నారు. అందులో బాగంగానే పాపికొండల విహారయాత్రకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే పర్యాటకుల్లో మాత్రం బోటు ప్రయాణం సురక్షితమేనా? ఎంత వరకు నిబంధనలు పాటిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రైవేటు బోట్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతిస్తామంటోంది. పూర్తి భద్రతా ఏర్పాట్లతో రంగం సిద్ధం చేస్తోంది.గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించడం ఒక తీయని అనుభూతి. రెండు దశాబ్దాలుగా పాపికొండలు పర్యాటకంగా ప్రత్యేక గుర్తింపును పొందాయి. ఒంపులు తిరుగుతూ సాగే గోదావరిలో ప్రయాణమే కాకుండా అక్కడక్కడ ఇసుక తెన్నెలపై సేద తీరేందుకు యాత్రికులు అత్యధికంగా ఎగబడుతుంటారు. కొల్లూరు వద్ద హట్స్ ఏర్పాటు చేయడంతో అందులో నైట్ హాల్ట్‌కి అనేక మంది మొగ్గు చూపేవారు. అటు రాజమండ్రి, పోలవరం వైపు నుంచి పేరంటాలపల్లి వరకూ వచ్చి తిరిగి వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తుంటారు. అదే సమయంలో భద్రాచలం ఆలయానికి వచ్చిన వారితో పాటుగా అనేక మంది విఆర్.పురం మండలం పోచారం నుంచి పాపికొండల వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. దీంతో ఇరువైపులా ఎపి టూరిజం బోట్లతో పాటుగా దాదాపుగా 100 వరకూ ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. నిత్యం వందల మంది పర్యటకులు బోట్లు ఎక్కేవారు. ఇక సెలవు దినాలు, పండుగల సమయాల్లో ఆ సంఖ్య వేలు దాటిపోయేది. ప్రస్తుతం పాపికొండలు పర్యాటకం ప్రారంభం కోసం పర్యాటకులతో పాటు దానిపై ఆధారపడిన బోట్లు నడిపేవారు. అందులో సహాయకులు, ఆహారం వండి, అందించే వారు, చిన్న చిన్న వ్యాపారాలు, వాహనాలు నడిపేవారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా పాపికొండల పర్యాటకం మూలంగా ప్రత్యకంగానూ, పరోక్షంగానూ మూడు వేల మందికి పైగా ఉపాధి పొందేవారు ఉన్నారు.