శ్రీకాకుళం, నవంబర్ 16,
శ్రీకాకుళంలో వైసీపీ ఎంత బలంగా గత ఎన్నికల్లో తొంబై శాతం సీట్లు సాధించి విజయ ఢంకా మోగించిందో కానీ ఇపుడు అంతే వేగంగా ఆ బలం తగ్గిపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఐస్ క్రీం మాదిరిగా వైసీపీ బలం నానాటికీ కరిగిపోతోంది. అదే సమయంలో టీడీపీ అక్కడ బాగా పుంజుకుంటోంది. జిల్లా వైసీపీలో అనేక వర్గాలు, ఎవరి మాట ఎవరూ వినరు, జిల్లాకు ఇద్దరు మంత్రులు, స్పీకర్, సీనియర్ నేతలు ఇలా చాలా మంది ఉన్నా కూడా వైసీపీ వెలవెలపోతోంది. అసలు పార్టీ అన్నది అక్కడ కనిపించకుండా పోయింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ పదవి నుంచి కిల్లి కృపారాణి తప్పుకున్నారని టాక్ నడుస్తోంది.బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళా నేతగా, విద్యావంతురాలిగా, వైద్యురాలిగా, సామాజిక నాయకురాలిగా కిల్లి కృపారాణికి ఎంతో పేరు ఉంది. ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. జిల్లాలో దిగ్గజ నేత, ఓటమెరుగని వీరుడు అయిన ఎర్రన్నాయుడుని ఆమె 2009 ఎన్నికల్లో ఓడించారు. ఆమె వైసీపీలోకి వచ్చినా జగన్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న బాధలో ఉన్నారు. తనను రాజ్యసభకు పంపుతాను అని హామీ ఇచ్చి కూడా నెరవేర్చలేదన్న అసంతృప్తి కిల్లి కృపారాణిలో ఉంది. దానికి తోడు జిల్లాలో పార్టీని ఒక గాడిన పెడదామని ఆమె చూసినా ఏ ఒక్కరూ సహకరించకపోవడంతో ఆమె తీరని మనస్థాపంతో పార్టీ పదవికి గుడ్ బై కొట్టేశారు అంటున్నారు.ఇలా హఠాత్తుగా కిల్లి కృపారాణి పార్టీ కాడి వదిలేయడంతో ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లా మీద దృష్టి పెట్టారని అంటున్నారు. అక్కడ ఏం జరుగుతోంది అన్నది ఆరా తీస్తున్నారు అని చెబుతున్నారు. జిల్లాలో పార్టీ పడకేసిన సత్యాన్ని అధినాయకత్వం ఎట్టకేలకు గుర్తించి రిపేర్లకు రెడీ అవుతోంది అంటున్నారు. ఈ నేపధ్యంలో పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి శాంతికే తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి గతంలో జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేశారు. దాంతో ఎమ్మెల్యేగా ఉన్న కారణం చేత ఆమె అన్ని విధాలుగా పార్టీని నడిపిస్తారని ఆశిస్తున్నారుట.ఇదిలా ఉంటే వైసీపీలో కిల్లి కృపారాణి కొనసాగుతారా లేదా అన్నది కూడా హాట్ హాట్ చర్చగా ఉంది. ఆమె వైసీపీలో చేరడాన్ని ధర్మాన సోదరులు అప్పట్లో వ్యతిరేకించారని కూడా టాక్ ఉంది. ఇక కాళింగ సామాజిక వర్గం నేతల నుంచి కూడా ఆమెకు సహకారం లేదు. ఆమె ఎక్కడ పోటీ అవుతారో అని అందరూ కలసి దూరం పెట్టారని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కిల్లి కృపారాణి వైసీపీ నుంచి తప్పుకుంటారన్నది బలమైన ప్రచారంగా ఉంది. ఆమె కొన్నాళ్ళపాటు సైలెంట్ గా ఉండి 2024 ఎన్నికల వేళకు తన కొత్త రాజకీయాన్ని మొదలుపెడతారు అని అంటున్నారు. అయితే ఆమె టీడీపీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా చర్చగా ఉందిట.