గుంటూరు, నవంబర్ 16,
రాష్ట్రంలో జిల్లాల పెంపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ సర్కారు ఈ క్రమంలో రాజకీయ లబ్ధిని పొందేలా ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసి.. అభివృద్ధి చేయడం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా విజయనగరం, హిందూపురం, విశాఖలు పార్లమెంటు నియోజకవర్గాలే అయినప్పటికీ.. వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.అంటే.. వీటిని గ్రేటర్ జిల్లాలుగా ప్రకటించాలని వైసీపీ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రిందటే జిల్లాల ఏర్పాటుపై అధికారులతో ఓ కమిటీ వేశారు. ఇందులో రాజకీయ నాయకుల ప్రాధాన్యం చాలా పరిమితం చేశారు. అయితే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుపై వైసీపీ నాయకుల నుంచే కాకుండా, సాధారణ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అరకు లాంటి ఎంపీ సీట్లు ఏకంగా నాలుగు జిల్లాల్లో ఉన్నాయి. వీటిని ఒక జిల్లాగా చేయడం కుదరదు.ఈ క్రమంలోనే జగన్ 25 లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలు కాకుండా ఏపీలో మొత్తం 32 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు / ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించి అక్కడ ఆ పార్టీని మరింత వీక్ చేయడంతో పాటు వైసీపీ మరింత స్ట్రాంగ్ అయ్యే ప్లానింగ్‌తో జగన్ ఉన్నట్టు కొత్త జిల్లాల నివేదికలు చూస్తేనే అర్థమవుతోంది. పలు ఈక్వేషన్లతో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని వీక్ చేసిన జగన్ ఇప్పుడు ఆ జిల్లాలో నియోజకవర్గాలను పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు.విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. ఈ జిల్లాలో విశాఖ, అనకాపల్లితో పాటు ఏజెన్సీ ప్రాంతాలను అరకు జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక టీడీపీ మరో కంచుకోట హిందూపురం కూడా జిల్లా కేంద్రం కానుంది. ఈ జిల్లాలో హిందూపురంతో పాటు కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ కూడా వైసీపీ జెండా ఎగిరేలా ప్లాన్ చేసే క్రమంలోనే కొత్త జిల్లా ఏర్పాటు అవుతోంది.అలాగే, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో నరసారావుపేటను జిల్లాగా ప్రకటించనున్నారు. ఇక గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన సీట్లు గుంటూరు జిల్లాలోని రేపల్లె, బాపట్లను కలిపి ప్రత్యేక బాపట్ల జిల్లాగా ఏర్పాటు చేస్తోంది. అలాగే రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక అమరావతి జిల్లాగా ఏర్పాటు చేస్తోంది. ఇందులో కృష్ణా జిల్లాలో టీడీపీ కంచుకోటలు అయిన నందిగామ, జగ్గయ్యపేటతో పాటు రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలా టీడీపీ కంచుకోటలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు జగన్ మాస్టర్ ప్లాన్లు మామూలుగా వేయడం లేదు.