YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మున్సిపల్ వేళ... తుమ్మల మాట

మున్సిపల్ వేళ... తుమ్మల మాట

ఖమ్మం, నవంబర్ 16, 
మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు టైం మ‌ళ్లీ స్టార్ట్ అయిందా.. ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వం తెరాస‌కు అవ‌స‌ర‌మొచ్చిందా.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. దీనిలో భాగంగానే మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి,  పువ్వాడ అజ‌య్‌లు స్వ‌యంగా ఆయ‌న నివాసానికి వెళ్లి ఓ అధికారిక కార్య‌క్ర‌మానికి తీసుకెళ్లారు. ఆ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త అంతాఇంతా కాదు. ఈ స‌న్నివేశాన్ని చూసిన తుమ్మ‌ల వ‌ర్గీయులు తెగ మురిసిపోతున్నారంట‌. అయితే కొంత రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన వారైతే.. ఇదో రాజ‌కీయ స్ట్రాట‌జీ అంటున్నారు. 2018 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పాలేరులో ఓట‌మి త‌రువాత తుమ్మ‌ల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కొంత దూరంగానే ఉంటున్నారు. దీనికితోడు పువ్వాడ అజ‌య్‌కు మంత్రి ప‌ద‌వి రావ‌టంతో ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలను అజ‌య్ పూర్తిగా త‌న‌వైపుకు తిప్పుకున్నాడు. తెరాస‌లోనే కీల‌కంగా ఉన్న తుమ్మ‌ల వ‌ర్గీయుల‌ను ప‌క్క‌న పెట్టి త‌న వ‌ర్గీయుల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డంతో పాటు.. జిల్లాలో పార్టీ ప‌రంగా, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల ప‌రంగా అజ‌య్ త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో తుమ్మ‌ల‌సైతం రాజ‌కీయాల‌కు దూరంగా త‌న సొంతూరు గండుగ‌ల‌ప‌ల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో త‌న‌పని తాను చేసుకుంటున్నారు.  మాజీ మంత్రి తుమ్మ‌లకు తెలంగాణ ప్ర‌భుత్వం అనూహ్య ప్రాధాన్య‌త‌నివ్వ‌డం జిల్లా రాజ‌కీయాల్లోనే కాక రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఏకంగా త‌మ్మ‌ల వ‌ర్గీయులు త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా భావిస్తున్న మంత్రి అజ‌య్ కుమార్ మ‌రో మంత్రి నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి తుమ్మ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌కు అధిక ప్రాధాన్య‌త‌నివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల స్ట్రాట‌జీ ఉన్న‌ట్లు చ‌ర్చ సాగుతుంది. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. మ‌రో వారం రోజుల్లో నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో గ్రేట‌ర్‌లో తుమ్మ‌ల సేవ‌లు అవ‌స‌రం అని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స‌మ‌యంలోనూ.. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రం హైద‌రాబాద్‌లో తుమ్మ‌ల‌కు బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణమే ఉంది. క‌మ్మ సామాజిక వ‌ర్గం మొత్తం తుమ్మ‌ల మాట‌కు విలువ‌నిస్తారు. ఆయ‌న ఒక్క మాట చెబితే ఆ సామాజిక వ‌ర్గం ఓట్లు గంప‌గుత్త‌గా ప‌డిపోవ‌టం ఖాయం. అయితే ప్ర‌స్తుతం తుమ్మ‌ల తెరాస కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ తుమ్మ‌ల‌కు పార్టీలో ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్లు షో చేయ‌డం ద్వారా గ్రేట‌ర్‌లో అధిక‌శాతం క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు తెరాస‌కు మ‌ళ్లించ‌వ‌చ్చ‌నేది సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌. మ‌రో అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా తుమ్మ‌ల‌ను అక‌స్మాత్తుగా తెర‌పైకి తెచ్చార‌నే ప్ర‌చారం సాగుతుంది. ఖ‌మ్మం కార్పొరేష‌న్లో కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో తుమ్మ‌ల‌కు బ‌ల‌మైన వ‌ర్గ‌మే ఉంది. ప్ర‌స్తుతం తుమ్మ‌ల‌కు త‌గిన ప్రాధాన్య‌త లేక‌పోవ‌టంతో వారంతా తెరాస అధిష్టానంపై కొంత ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో తుమ్మ‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం ద్వారా ఆయ‌న వ‌ర్గీయుల‌ను చ‌ల్ల‌బ‌ర్చి.. ఖ‌మ్మంలోనూ ఎదురులేకుండా మ‌రోసారి కార్పొరేష‌న్ కైవ‌సం చేసుకోవ‌చ్చ‌నేది తెరాస అధిష్టానం వ్యూహం. ఈ రెండు అంశాల‌ను బేరీజు వేసుకొని తుమ్మ‌ల‌కు అక‌స్మాత్తుగా ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా మొత్తానికి మ‌ళ్లీ మానేత‌కు ప్రాధాన్య‌త ల‌భించింద‌ని తుమ్మ‌ల వ‌ర్గీయులు సంతోషం వ్య‌క్తం చేస్తుండగా.. అదే వ‌ర్గంలోని కొంద‌రు మాత్రం ఇందులో కేసీఆర్ ఎన్నిక‌ల స్ట్రాట‌జీ ఉన్న‌ట్లు పేర్కొంటున్నారు. ఎన్నిక‌లు పూర్త‌యితే మ‌ళ్లీ తుమ్మ‌ల త‌న వ్య‌వ‌సాయ క్షేత్రానికి వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.

Related Posts