హైద్రాబాద్, నవంబర్ 16,
కోవిడ్ విజృంభణ, లాక్‌డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉన్నత విద్యారంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. తరగతులు, పరీక్షలు వంటివేవీ లేకుండా జీరో అకడమిక్ ఇయర్‌గా మారే అవకాశం ఉందని అంతా భావించినా.. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్ తరగతులు ద్వారా విద్యార్థులకు చేరువవుతున్నారు. గత నెల ఒకటి నుంచే యూజీ, పీజీ తరగతులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు కొందరు నెట్‌వర్క్, సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో తరగతులు వినలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భిన్నాభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి. క్లాస్ రూమ్ టీచింగ్ ఉత్తమమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులతో విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రానున్న సెమిస్టర్ తరగతులను నేరుగా నిర్వహించాలంటున్నారు. పరీక్షలు నిర్వహించాల్సిన సమయానికి కొద్దిముందే లాక్‌డౌన్ విధించడంతో వాయిదా పడ్డాయి. అన్‌లాక్ ప్రారంభమైన అనంతరం కోర్సు ముగియనున్న విద్యార్థులకు డిగ్రీ ఫైనలియర్ చివరి సెమిస్టర్, పీజీ రెండో సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలను ఆయా యూనివర్సిటీలు నిర్వహించాయి. మిగిలిన సెమిస్టర్ల పరీక్షా తేదీలపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. యూజీ కోర్సులకు సంబంధించి ఈ సెమిస్టర్ చివరి పని రోజును జనవరి 18గా ప్రభుత్వ నిర్ణయించింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం చివరి సెమిస్టర్ తరగతులు ప్రారంభించి, వాటికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇదంతా పూర్తయ్యే సరికి జూన్ సమీపిస్తుందని విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. అందువల్ల కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ, కళాశాలలు, యూనివర్సిటీలు ప్రారంభించాలని పేర్కొంటున్నారు. మరోవైపు ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోవడం వల్ల ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఫలితాలు ఆలస్యంగా రావడంతో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమై, ఇటీవలే పూర్తయింది. కానీ, సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. వారికి చాన్స్ ఇస్తూ మరోమారు కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు రాష్ట్ర ఉన్నత విద్యామండలిని కోరుతున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ మొదటి సంవత్సరం తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ నోటిఫికేషన్‌ను సాధారణంగా ఏప్రిల్ చివర్లో విడుదల చేస్తుంటారు. ఈసారి మాత్రం సెప్టెంబర్ 18న ఇచ్చారు. అపరాధ రుసుముతో ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల 1 నుంచి పరీక్షలుంటాయి. ఫలితాలు విడుదలై, కౌన్సిలింగ్ పూర్తయి తరగతులు ప్రారంభమవ్వడానికి జనవరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పలు పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ప్రాక్టికల్స్ వైవా, ప్రాజెక్ట్ వైవా, ఇంటర్న్‌షిప్ ఆన్‌లైన్ విధానంలో చేపట్టి, ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ విద్యార్థులను ప్రశ్నించి మార్కులు వేస్తున్నారు. అలా విద్యార్థులు కళాశాలకు రాకుండానే పరీక్షలకు హాజరవుతున్నారు.