YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆత్మనిర్భర భారత నిర్మాణానికి యువత కృషి చేయాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

ఆత్మనిర్భర భారత నిర్మాణానికి యువత కృషి చేయాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

హైదరాబాద్ నవంబర్ 16 
భారత యువత దేశాభివృద్ధిలో భాగస్వాములై తమ శక్తియుక్తులతో నవ, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారాలను కనుగొనే దిశగా కృషి చేయాలని యువతకు సూచించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాయంలో అదనపు సౌకర్యాల కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. యువత ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే సాధించలేనిది ఏదీ ఉండదని దిశానిర్దేశం చేశారు. నిరక్షరాస్యత, లింగవివక్షత, అత్యాచారాలు, అవినీతి వంటి సాంఘిక దురాచారాలను తొలగించడంతోపాటు, వ్యాధులపై జరుగుతున్న పోరాటంలో, వ్యవసాయరంగంలో అవసరమైన మార్పులను తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి  సూచించారు. కరోనా, వాతావరణమార్పులు వంటి సమస్యల పరిష్కారానికి యువత వినూత్న, సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకురావాలని సూచించిన ఉపరాష్ట్రపతి, దేశప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో పరిపూర్ణ విద్య పాత్ర చాలా అవసరమన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన విద్యావిధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, నైతిక విలువలను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో భారత్ నుంచి కొన్ని విద్యా సంస్థలకే చోటు దక్కడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే దిశగా మన విశ్వవిద్యాలయాలు మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రపంచ వినూత్న, సృజనాత్మక ఆలోచనల కేంద్రంగా భాసిల్లే సత్తా భారత్ కు ఉన్నదన్న ఉపరాష్ట్రపతి.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి ఉన్నతవిద్యాసంస్థలు ఈ దిశగా మరింత కృషిచేయాలని సూచించారు. పరిశ్రమలతో అనుసంధానమై.. విద్యార్థులకు అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు పూర్తయినా.. ఇంకా 100 శాతం అక్షరాస్యత సాధించలేకపోయిన విషయాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, సంపూర్ణ అక్షరాస్యత కలిగిన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిని నిరోధించేందుకు పూర్తిస్థాయిలో టీకా వచ్చేంతవరకు అలసత్వం వహించరాదని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి ఎల్ నర్సింహారెడ్డి, ఉపకులపతి పొదిలి అప్పారావుతోపాటు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యారంగ ప్రముఖులు హాజరయ్యారు.

Related Posts