YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

హైద్రాబాద్, నవంబర్ 16 
రాష్ట్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త శకం ప్రారంభం కానున్నది. దాదాపు రెండు నెలల తర్వాత వ్యవ సాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి అన్ని ఆఫీసుల్లో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ధరణి పోర్టల్‌ ద్వారా తాసిల్‌ ఆఫీసుల్లో ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభంకాగా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ప్లాట్లు, ఇండ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతుండగా, అందులో దాదాపు 8 లక్షల వరకు నాన్‌ అగ్రికల్చర్‌ భూములే. ఇప్పటి వరకు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ (కార్డు) విధానం కొనసాగుతూ వచ్చింది. 1999లో కార్డు ద్వారా రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇకనుంచి కార్డుకు బదులు ధరణి నాన్‌అగ్రికల్చర్‌ పోర్టల్‌ అందుబాటులోకి రానున్నది.కంప్యూటరీకరణలో రిజిస్ట్రేషన్ల శాఖ మొదటి నుంచీ అగ్రస్థానంలోనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బ్లాక్‌చైన్‌తో పాటు ఆధునికసాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి స్లాట్‌ బుకింగ్‌ వంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టింది. అయితే, ఇంతకుముందు స్లాట్‌ బుకింగ్‌కు కనీసం అరగంట సమయం పట్టేది. ధరణిలో 5 నిమిషాల్లోనే స్లాట్‌ బుకింగ్‌ పూర్తికానున్నది. ప్రస్తుతం స్లాట్‌ బుకింగ్‌ పద్ధతి ఉన్నప్పటికీ అది తప్పనిసరి కాదు. స్లాట్‌ బుక్‌ చేసుకోనివారు నేరుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయించుకొనేవారు. ఇకపై స్లాట్‌ బుకింగ్‌ లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకొనే వీలుండదు.వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభ మవుతున్నా.. భూమి విలువల్లో మార్పు ఉండదు. 2013 ఏప్రిల్‌లో భూముల విలువనే ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఆ విలువ పెంచితే ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని భావించిన సర్కారు.. మార్కెట్‌ విలువను పెంచలేదు. వాస్తవానికి సంవత్సరం లేదా రెండేండ్లకు ఒకసారి ఆగస్టు లేదా ఏప్రిల్‌లో ప్రభుత్వం భూముల విలువ పెంచుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూముల విలువను పెంచలేదు. రిజిస్ట్రేషన్‌ రుసుం కూడా పెంచలేదు.

Related Posts