విజయవాడ నవంబర్16
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో 17 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇస్తామని.. మహిళలు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నాకు. ఒకవేళ అలా జరగని పక్షంలో వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయను అన్నారు. గుడివాడ గడ్డపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఇక్కడ ఇళ్ళు లేని పేదలు ఎంతో మంది ఉన్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా శంఖుస్థాపన చేశారే తప్ప ఇళ్ల గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు.. ఇళ్ల సముదాయాల వరకు వెళ్ళలేని పరిస్థితి ఉందన్నారు. గుడివాడ మార్కెట్ యార్డులో టిడ్కో లబ్ధిదారులతో బహిరంగ సభ నిర్వహించారు.. పాదయాత్ర నిర్వహించారు.గుడివాడ నియోజకవర్గంలో అర్హులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు నాని. టిడ్కో లబ్ధిదారుల దగ్గర డబ్బులు బాబు కట్టించుకున్నారని.. వాటిని వేరే అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇళ్ళు కట్టించావో చెప్పాలని.. కొడాలి నాని అవినీతికి పాల్పడ్డాడని నిరూపిస్తే ఉరివేసుకోవడానికి సిద్ధమన్నారు. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. టిడ్కో ఇళ్ల వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయిస్తాను అన్నారు. రాష్ట్రానికి శనిలా పట్టిన చంద్రబాబు కాకిలా కలకాలం ఉంటారని.. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రజా సంక్షేమానికై పాటుపడుతున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వెన్నుపోటుకు మారుపేరైన బాబు మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇళ్ళు ఇవ్వకపోగా శకునిలా అన్నింటికీ అడ్డుపడుతున్నారని.. బాబు అండ్ కో బ్యాచ్‌కి కులగజ్జి పట్టుకుంది అన్నారు. ఇతర కులస్తులు ముఖ్యమంత్రిగా ఉంటే ఓర్వలేక పోతున్నారని.. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను బతికున్నంత వరకు ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని.. 2024 ఎన్నికల నాటికి ఇళ్ళు ఇవ్వకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు.