జిల్లా పశ్చిమాన తెలుగుదేశం పార్టీకి నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి పెద్దదిక్కుగా మారుతున్నారు. అధికార పార్టీలో ఆయన ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవితో అధికారమూ దక్కింది. దీంతో పడమట ప్రత్యేకించి గత ఇరవై ఏళ్లుగా పార్టీ జెండా ఎగరని పీలేరు నియోజకవర్గంలో శ్రేణుల ఆనందోత్సాహాలు చెప్పనలవి కావడం లేదు. పీలేరు నియోజకవర్గంలో రాజకీయంగా రెండు ప్రధాన వర్గాల్లో అలుముకున్న నిస్పృహ, తద్వారా ఏర్పడ్డ కసి ఇప్పుడు అధికార పార్టీని అనూహ్యంగా బలోపేతం చేస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందింది లేదు. వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఓటమే ఎదురుకావడంతో నాయకత్వ కొరత తలెత్తింది. దీంతో శ్రేణుల్లోనూ నైరాశ్యం అలముకుంది.
ఇదే నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్లుగా తెరవెనుకే ఉండి రాజకీయాలు నడిపి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా నిలిచిన ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి సంక్లిష్ట పరిస్థితుల్లో గత ఎన్నికలప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అటు తమకు, ఇటు నియోజకవర్గానికి విలువైన సేవలందించిన కిశోర్ ఓటమి చెందడం నల్లారి కుటుంబ అభిమానులను తీవ్ర నిస్పృహకు గురి చేసింది. గతేడాది చివరన కిశోర్ టీడీపీలో చేరడంతో నియోజకవర్గంలోని బలమైన ఈరెండు వర్గాలూ ఒక్కటయ్యాయి. దాంతో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోయాయి. పార్టీలో చేర్చుకునే సందర్భంలో కిశోర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించిన సమయం, ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో తమ నేతకు సముచిత గౌరవం లభిస్తుందని భావించిన అనుచరవర్గం ఆయన పార్టీలో చేరినపుడు పెద్దసంఖ్యలో విజయవాడకు తరలివెళ్లింది. బలమైన నాయకత్వం లేక సతమతమవుతున్న టీడీపీ శ్రేణులు కిశోర్ రాకను మనస్ఫూర్తిగా స్వాగతించాయి. ఇక స్వల్ప వ్యవధిలోనే ఆయనకు ఐడీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో టీడీపీలోని పాత, కొత్త శ్రేణుల సంబరం చెప్పనలవి కాకుండాపోతోంది. ఐడీసీ ఛైర్మన్ హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు శనివారం రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు అట్టహాసంగా స్వాగతం పలికాయి. ఆయన పార్టీలో చేరినప్పుడు, తాజాగా ఐడీసీ ఛైర్మన్ హోదా లో జిల్లాకు వచ్చినప్పుడూ జిల్లా ముఖ్యమైన నేతలు మొదలుకుని మండల స్థాయి నాయకుల వరకూ నగరిపల్లెకు క్యూకట్టారు. ఇవన్నీ జిల్లా టీడీపీలో కిశోర్ ప్రాధాన్యం పెరుగు తుండటాన్ని చాటిచెబుతున్నాయి.
కిశోర్‌కు ఇంతటి ప్రాముఖ్యం ఇవ్వడానికి అసలు కారణం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలనుకోవడమే. పశ్చిమాన బలహీనంగా ఉన్న టీడీపీకి బలమైన నాయకత్వాన్ని అందివ్వడంతో పాటు అక్కడ పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్నదీ అధిష్ఠానం ఆలోచన. గతంలో పీలేరు.. ఇప్పుడు పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో బలమైన వర్గాన్ని కలిగి ఉన్నారు. ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీ. నల్లారి కుటుంబానికి తొలి నుంచీ సదుం, సోమల మండలాల్లో గణనీయమైన పలుకుబడి ఉంది.
మదనపల్లె, తంబళ్లపల్లెల్లోనూ అనుచరవర్గం ఉంది. ఇప్పుడు కొంతమేరకు అధికారం కూడా తోడు కావడంతో పుంగనూరులో పెద్దిరెడ్డిని, రాజంపేటలో మిథున్‌రెడ్డిని దెబ్బతీసి ఆయా స్థానాల్లో టీడీపీకి విజయం సాధించి పెట్టేందుకు కిశోర్ దూకుడుగా వెళ్లే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే వ్యవహారశైలినీ ఎంతగానో మార్చుకుని శ్రేణులకు దగ్గరవుతున్న ఆయన.. టీడీపీ, ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటారో, పశ్చిమాన పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని ఎంతవరకు దెబ్బతీస్తారో వేచి చూడాలి.