అమరావతి నవంబర్ 16
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను వచ్చే కొత్త సంవత్సరంలో ప్రారంభించాలని ఏపీ సర్కార్ వడివడిగా ముందుకెళుతోంది. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేయగా.. అధికారులు దాదాపు జిల్లాల పునర్వ్యస్థీకరణను కొలిక్కి తెచ్చారు. సోమవారం దీనిపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.జిల్లాల ఏర్పాటుతో కొన్ని శాఖల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. జిల్లాల పునర్విభజనపై సీఎస్ నీలం సాహ్ని నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే అధ్యయనం దాదాపుగా పూర్తి చేసినట్టు తెలిసింది. ప్రత్యేకించి రెవెన్యూ పోలీస్ శాఖల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కొత్తగా రెవెన్యూ డివిజన్లు పోలీస్ కమిషనరేట్లను పెంచడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.వచ్చే సంక్రాంతి లేదా.. జనవరి 26కు కొత్త జిల్లాలను ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. పునర్వ్యస్థీకరణలో తలెత్తుతున్న సమస్యలు డిమాండ్లపై సీఎంకు కమిటీ వివరించారు.జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సమకూర్చాల్సిన నిధులు అధికారిక పోస్టులు కొత్త జిల్లాల్లో భవన సముదాయాలపై సీఎంకు కమిటీ నివేదించినట్టు తెలిసింది. కమిటీ సిఫార్సులను సీఎం జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.