YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జిల్లా టీడీపీలో అంతే...

జిల్లా టీడీపీలో అంతే...

స్వపక్షంలో నిత్యం ఏదోఒక సమస్యతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతోంది. మొన్నటి వరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీ అలేఖ్యను మార్చి ఆ స్థానంలో ముందుగాకుదుర్చుకున్న ఒప్పందం మేరకు గుంటుపల్లి శ్రీదేవి చౌదరికి ఇవ్వాలని అనేక ప్రయత్నాలు జరుగాయి. ఈ మార్పునకు అలేఖ్య అంగీకరించక పోవటంతో టీడీపీలో పలు పర్యాయాలు చర్చలు, సమావేశాలు నిర్వహించి చివరకు ఎన్నికల సమయంలో చైర్‌పర్సన్‌ను మార్చటం వీలుపడదని సీఆర్‌డీఏ సభ్యుడు బీద మస్తాన్‌రావు స్పష్టం చేశారు. చైర్‌పర్సన్‌ను మార్చాలంటే ఆమెను దించి మరలా కొత్తవారిని ఎక్కించటం ప్రస్తుత పరిస్థితుల్లో తగదని ఆ పదవిని ఆశిస్తున్న గుంటుపల్లి శ్రీదేవి చౌదరికి స్పష్టం చేశారు. దీంతో ఆమె కొంత అలక బూనటంతో బీఎంఆర్‌ ఆమె ఇంటికి వెళ్లి ఏదో ఒక మంచి పదవి ఇస్తామని చెప్పి బుజ్జగించారు.

తొలుత శ్రీదేవి భర్త రాజకుమార్‌ చౌదరికి పార్టీ పట్టణాధ్యక్షపదవి ఇస్తామని చెప్పటంతో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ ఆయన అనుచరులు అధ్యక్షపదవి తీసుకోమని ఒత్తిడి చేయడంతో రాజకుమార్‌ చౌదరి శనివారం కావలిలోని బీఎంఆర్‌ నివాసంలో పలు దఫాలు చర్చలు జరిపారు. దీంతో టీడీపీ పట్టణాధ్యక్ష పదవిని రాజకుమార్‌ చౌదరికి ఇవ్వాలనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో పట్టణాధ్యక్షుడిగా ఉన్న అమరా వేదగిరి సుబ్బురాయుడు గుప్తాతో కూడా బీఎంఆర్‌ చర్చించి అధ్యక్ష పదవిని స్వచ్ఛందంగా వదులుకుంటే పార్టీలో సమస్య తొలగిపోతుందని.. జిల్లా స్థాయిలో సమున్నత పదవి వచ్చేట్లు చూస్తానని హామి ఇచ్చినట్లు తెలిసింది. అలాగే వేదగిరి సోదరుడు సుబ్బారావుతో కూడా బీఎంఆర్‌ చర్చించినట్లు తెలిసింది. అమరా సోదరుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవటంతో ఆలోచించుకుని వారం రోజుల తర్వాత మీ నిర్ణయం తెలియచేస్తే ఆ తర్వాత దానిపై ఒక నిర్ణయానికి వద్దామని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం టీడీపీలో దానవాలంలా వ్యాపించటంతో టీడీపీ వర్గాలలో హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో చైర్‌పర్సన్‌ ఆశచూపి చివరిలో చేతులెత్తేసినట్లుగా పట్టణాధ్యక్ష పదవిలో కూడా అన్యాయం జరిగితే తాము సమాజంలో తలెత్తుకుని తిగలేమని రాజకుమార్‌చౌదరి తన అనుయూయల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

అమరా సోదరులు కూడా తమకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఇస్తామని ఆశచూపి చివరిలో వీలుకాక పోవటంతో దానిని ఇవ్వలేదన్నారు. తాము అడగకుండానే పట్టణాధ్యక్ష పదవిని తీసుకోమని బీఎంఆర్‌ చెప్పగా ఆయన మాటను గౌరవించి ఆ పదవిని తీసుకున్నా మన్నారు. ఒక్కఏడాది పూర్తి కాగానే ఆ పదవిని తీసేస్తే తాము సమాజంలో ఏమని చెప్పుకోవాలని అమరా సోదరులు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలలో పదవుల పంపకం బీద సోదరులకు పెద్ద సమస్యగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల్లో అన్ని సామాజిక వర్గాలను సంతృప్తిపరచటం పార్టీకి సమస్యగా మారింది.

బీఎంఆర్‌ ఇక్కడ చర్చలు జరిపినా కీలకనిర్ణయాలలో బీఎంఆర్‌ సోదరుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నిర్ణయం మేరకు చేర్పులు మార్పులు ఉంటాయనేది టీడీపీలో చర్చనీయాంశమైంది. చైర్‌పర్సన్‌ మార్పు విషయంలో కౌన్సిల్‌లో బలాబలాలతో ముడిపడి ఉండటంతో బీద సోదరులు వెనుకంజ వేశారు. పార్టీ అధ్యక్షపదవి విషయంలో బలాబలాలతో సంబంధం లేకుండా బీద సోదరులు తీసుకునే నిర్ణయం మేరకే ఆధారపడి ఉండటంతో బీద సోదరుల నిర్ణయం ఎలా ఉంటుందనేది నేతలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Related Posts