న్యూఢిల్లీ, నవంబర్ 17,
అధికార దాహానికి అంతుండదు. దానిని తీర్చడం అసాధ్యం. ఏ వ్యవస్థలో అయినా ఒకసారి అధికారం చేపట్టిన వారు జీవితాంతం పదవిలో కొనసాగాలని కోరుకుంటారు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అసాధ్యం. ప్రజానుగ్రహం ఉన్నంతవరకే అది సాధ్యం. లేనినాడు దిగిపోక తప్పదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే పరమపదించే వరకు పదవిలో కొనసాగారు. దేశ ప్రగతి పట్ల ఆయనకు గల చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం పట్ల గల నిబద్ధత నెహ్రూను తిరుగులేని నేతగా నిలిచాయి. ఆ తరవాత ఏ నేతా ఇంతటి ఘనతను సొంతం చేసుకోలేకపోయారు. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రతి నాయకుడు అధికారాన్ని అంటి పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు 2000 సమయంలో 2020 అంటూ ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. పైకి రాష్ర్ట ప్రగతి కోసం అని చెప్పినప్పటికీ అసలు ఉద్దేశం 2020 దాకా సీఎం ఉండటమే ఆయన అంతరంగం. తరవాత ఏమైందో అందరికీ తెలుసు. ప్రజాభిమానం ద్వారానే పదవిలో కొనసాగగలం తప్ప ఎత్తులు, పైయెత్తులతో అధి సాధ్యం కాదన్న సంగతి చరిత్ర చెబుతున్న సత్యం. ఇది నేతలకు ఎప్పడు అర్థమవుతుంది? తాజాగా అలాంటి ప్రయత్నానికి తెర లేపారు చైనా అధినేత జిన్ పింగ్. మరో 15 ఏళ్లపాటు అంటే 2035 వరకు అధికారంలో ఉండేందుకు పావులు కదుపుతున్నారు డ్రాగన్ అధినేత.పొరుగున ఉన్న కమ్యూనిస్టు రష్యా అధినేత పుతిన్ 2000 సంవత్సరం నుంచి పదవిలో కొనసాగుతున్నారు. ఇందుకోసం అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చారు. అధ్యక్షుడిగా కొంతకాలం, ప్రధానిగా మరి కొంతకాలం కొనసాగుతూ దేశంపై పట్టు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జిన్ పింగ్ సైతం ఇదే బాటలో ప్రయాణిస్తున్నారు. దేశాన్ని ప్రగతిబాటలో నడిపించే పేరుతో మరికొంత కాలం పదవిలో కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. దేశాన్ని సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే పేరుతో ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో ఒక దార్శనిక పత్రాన్ని ప్రవేశపెట్టారు. 204 మంది సభ్యులు గల సెంట్రల్ కమిటీ, 172 మంది సభ్యులుండే ప్రత్యామ్నాయ కమిటీ దీనిపై చర్చించింది. పార్టీ 18వ సెంట్రల్ కమిటీ, అయిదో ప్లీనరీలో దీనికి సంబంధించిన అంశాలను చర్చించి ఆమోదించింది. దీనర్థం జిన్ పింగ్ మరికొంత కాలం పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమం చేసినట్లే.నవ చైనా నిర్మాత మావో జెడాంగ్ లా తానూ శక్తిమంతుడైన దేశాధినేతగా జిన్ పింగ్ తలపోస్తున్నారు. ప్రస్తుతం ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అధిపతిగా, చైనా అధ్యక్షుడిగా తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్నారు. అగ్రదేశంగా ఎదిగేందుకు తద్వారా యావత్ ప్రపంచంపై పట్టు సాధించేందుకు తపన పడుతున్నారు. ఇందులో భాగంగానే పదవిలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ డెంగ్ జియావో పింగ్ 1982లో రాజ్యాంగానికి చేసిన సవరణ ప్రకారం ఏ నాయకుడూ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదు. మూడోసారి అనుమతిస్తే అది వ్యక్తి స్వామ్యానిక దారితీస్తుందని ఆయన భావించారు.అప్పటి నుంచీ అదే విధానం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జిన్ పింగ్ పదవీ కాలం 2022 వరకు ఉంది. ప్రస్తుతం ఆయన వయసు 67 ఏళ్లు. ఈలోపు దేశాన్ని బలోపేతం చేసే పేరుతో 2035 వరకు అంటే 82 సంవత్సరాలు వచ్చేవరకు పీఠంపై కొనసాగేందుకు తెలివిగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం జిన్ పింగ్ మాటకు దేశంలో తిరుగులేదు. ఆయన ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయలేరు. అందువల్ల జిన్ పింగ్ మనసులోని మాట నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తనకు లభించబోయే అవకాశాన్ని దేశ ప్రగతికి పాటుపడతారా లేక మరో నియంతగా మారుతారా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.