YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీసీ లోన్లు బొక్కేశారు

బీసీ లోన్లు బొక్కేశారు

కార్పొరేషనులో దొంగలు పడ్డారు. ఆ శాఖలో పనిచేసిన ఉద్యోగులు, బ్యాంకర్లు కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారు. బోగస్‌ పేర్లు సృష్టించి బీసీ రుణాల మంజూరులో ప్రభుత్వ రాయితీ సొమ్ముకు ఎసరు పెట్టారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని రెండు బ్యాంకుల్లోనే దాదాపు రూ.30లక్షలు రికవరీ చేసి ప్రభుత్వానికి పంపాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచారిస్తే రూ.కోట్ల అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇక్కడి అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం రుణాల మంజూరులో వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆదిలాబాద్‌లో సస్పెన్షన్‌ వేటు పడిన ఓ ఉద్యోగి పరారీలోనే ఉన్నాడు. కార్యాలయంలోని దస్త్రాలన్నీ కనిపించకుండా మాయం చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన యూనిట్లను అందిస్తుంది. పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 2015-16లో బీసీ కార్పొరేషను ద్వారా 1407 మందికి రూ.21.78కోట్ల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఇందులో రూ.13కోట్ల వరకు ప్రభుత్వం రాయితీని అందించింది. ప్రస్తుత ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.3.77కోట్ల రాయితీని 472మందికి అందించినట్లు లెక్కలు చూపుతున్నారు. ఈ శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులతో బ్యాంకు అధికారులు కుమ్మక్కయ్యారు. బోగస్‌ పేర్లు సృష్టించి భారీగా ప్రభుత్వం నుంచి బ్యాంకులకు వచ్చిన రాయితీని కాజేశారు. ప్రస్తుతం మళ్లీ కొత్త రుణాల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సాగుతోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపించాల్సిన అధికార యంత్రాంగం కేవలం ఆదిలాబాద్‌లోని రెండు బ్యాంకుల్లో నామమాత్రపు విచారణ చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 24మంది బోగస్‌ పేర్లతో రూ.19.20లక్షలు, ఎస్‌బీఐలో 12మంది పేర్ల మీద రూ.9.60లక్షల రాయితీని కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ రెండు బ్యాంకుల నుంచి 36మంది పేర్లమీద రూ.28.80లక్షలు బ్యాంకర్లు మింగేశారు. లబ్ధిదారులకు బ్యాంకు రుణం మంజూరు చేయకుండానే.. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ సొమ్ము జమ అయిన నాన్‌ ఆపరేటీవ్‌ ఖాతాల నుంచి బ్యాంకర్లు అవినీతికి పాల్పడ్డారు. వాస్తవానికి ఈ ఖాతాల నిర్వాహణ పూర్తిగా బ్యాంకు మేనేజర్ల కనుసన్నల్లోనే జరగాలి. అయినా ఏటీఎం కార్డుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం ఆశ్చర్యకరం. సిటీయూనియన్‌ బ్యాంకులో నలుగురి పేర్లుమీద మంజూరైన రూ.3.20లక్షల రాయితీను పూర్తిగా ఏటీఎం కార్డుల ద్వారా డ్రాచేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు ఏటీఎం కార్డులు చేతికి ఇవ్వకూడదు. కానీ.. బోగస్‌ లబ్ధిదారులే కావడం వల్ల ఏటీఎం కార్డుల ద్వారా డ్రాచేసుకుని బ్యాంకర్లు దొరికిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో తప్పుగా ఎంట్రీ అయిందని.. రాయితీ సొమ్మును బీసీ కార్పోరేషను వెనక్కురాబట్టుకుంది. ఆ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి పంపింది. కానీ.. అక్రమార్కులపైన క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆ తర్వాత ఏడాది 2016-17లో రాష్ట్ర వ్యాప్తంగా రుణాలనే మంజూరు చేయలేదు. 2017-18కి సంబంధించిన రుణాల కోసం దరఖాస్తుల ప్రక్రియనే ఇంకా కొనసాగుతోంది.

ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఫైళ్లన్నీ ఆదిలాబాద్‌ బీసీ కార్పోరేషన్‌ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. రెండు బ్యాంకుల్లోనే దాదాపు రూ.30లక్షల అవినీతి వెలుగులోకి రావడంతో ఓ ఉద్యోగిపైన సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయన అప్పటి నుంచి పరారీలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆచూకీ దొరకడం లేదని బీసీ కార్పోరేషన్‌ ఈడీ ఆశన్న తెలిపారు. మరో ఇద్దరు పదవీవిరమణ చేశారు. కార్యాలయంలో కొన్ని ఫైళ్లు కూడా అప్పగించలేదని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.10కోట్ల వరకు అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్‌, జైనథ్‌, నార్నూర్‌ ప్రాంతాల్లో బ్యాంకర్లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. జిల్లాల విభజన నేపథ్యంలో ఆయా జిల్లాల పాలనాధికారులు ప్రత్యేక చొరవచూపించి విచారణ జరిపితే భారీగా అవినీతికి పాల్పడ్డ అధికారుల వ్యవహారం బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

బ్యాంకర్ల అవినీతి వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు వచ్చిన రాయితీ సొమ్ము.. పొరపాటున వేరేవాళ్ల ఖాతాలో జమ అయిందని.. వాళ్ల నుంచి ఆ సొమ్మును రాబట్టామని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎ.శారద పేరుతో వచ్చిన రాయితీ సొమ్ము చుక్కబొట్ల మౌనిక ఖాతాలో జమచేసి కాజేశారు. ఇలాగే పి.రవికుమార్‌ రాయితీ జోగు పోతన్న, విమల పేరుతో మంజూరైన రాయితీ నర్సింహా ఫుడ్‌ ఇండస్ట్రీ, రాధా పేరుతో ప్రీతి జోగు, ఎన్నావర్‌ సత్యనారాయణ రాయితీ రాములు, కవితకు బదులు ఆనంద్‌, సురేఖ రాయితీ నరేశ్‌ల ఖాతాల్లో జమ అయిందని ఎస్సీ కార్పోరేషనుకు నివేదిక పంపారు. ఆదిలాబాద్‌లోని బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ రెండు బ్యాంకుల నుంచే 38మంది పేర్లతో మంజూరైన రాయితీ సొమ్ము వేరేవాళ్ల ఖాతాలోకి పొరపాటున పంపినట్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాయితీ సొమ్మును కాజెయ్యడానికే బోగస్‌ ఖాతాలు సృష్టించి ..వాటి నుంచే డబ్బులు కాజేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

Related Posts