తిరుపతి, నవంబర్ 18,
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసులు ఇక్కడ పుంజుకోలేక పోవడం. అదే సమయంలో అసలు నియోజకవర్గంలో కనిపించని నటి, రోజా.. ఇక్కడ రెండుసార్లు వరుసగా విజయాలు సాధించడం. ఈ రెండు పరిణామాలు కూడా రాజకీయ విశ్లేషకులకు అంతు చిక్కడం లేదు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకునే నాయకులకే ఇప్పుడు రాజకీయ సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాంటిది ఇక్కడ వరుస విజయాలు సాధించిన రోజా.. మాత్రం ఇక్కడకు విజిటింగ్ ఎమ్మెల్యేగా వస్తున్నా.. ఆమె హవా మాత్రం కొనసాగుతుండడం గమనార్హం.మరోవైపు ముద్దుకృష్ణమ కుమారుడు, ఆయన రాజకీయ వారసుడు గాలి భానుప్రకాశ్‌రెడ్డికి ఇక్కడ నియోజకవర్గంలోనే కాకుండా పార్టీలోనూ పట్టు దొరకడం లేదు. పైగా ఆయన మాట కూడా వినిపించడం లేదు. ముద్దు మృతితో ఇక్కడ ఆయన వారసుడిగా.. భాను పుంజుకుంటారని అందరూ అనుకున్నారు. వాస్తవానికి సింపతీ ఓటు బ్యాంకు గాలి కుటుంబానికి దన్నుగా మారుతుందని భావించారు. కానీ, గత ఏడాది ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాపై వ్యతిరేక వర్గం సొంతపార్టీలోనే ఓటమికి కృషి చేసినా.. ఆమె గెలుపు గుర్రం ఎక్కడం గమనార్హం. పోనీ.. ఓటమి తర్వాతైనా.. భాను పుంజుకుంటున్నారా ? అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.పైగా కుటుంబంలో కలివిడి లేకపోవడం, వివాదాలు.. కారణంగా.. భాను నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. గాలి మరణాంతరం కుటుంబంలో గాలి భార్య, ఎమ్మెల్సీ సరస్వతమ్మ, చిన్న కుమారుడు ఓ వర్గంగాను, పెద్ద కుమారుడు భాను మరో వర్గంగాను ఉంటున్నారు. ఎన్నికలకు ముందే వీరిద్దరి మధ్య ఎన్నోసార్లు పంచాయితీ చేసిన చంద్రబాబు భానుకు సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కూడా వీరి మధ్య పొసగకపోవడంతో పాటు ఒకరిని మరొకరు దెబ్బతీసుకునేలా వ్యవహరిస్తున్నారు.పరిణామాలతో విసుగు చెందారో.. ఏమో.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గాలి కుటుంబాన్ని పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల పార్టీలో అనేక పదవులు ఇచ్చారు. పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులను నియమించారు. అదే సమయంలో రాష్ట్ర కమిటీని కూడా వేశారు. భారీ ఎత్తున పదవులు పందేరం చేశారు. కానీ, అత్యంత కీలకమైన గాలి కుటుంబాన్ని పక్కన పెట్టారు. అయితే, ఈ విషయంలో సీనియర్లు కూడా చంద్రబాబును తప్పు పట్టలేక పోతున్నారు. ఆ కుటుంబంలోని లోపాల కారణంగానే చంద్రబాబు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక్కడ పరిస్థితిలో మార్పు రాకపోతే మరో నేతను కూడా చంద్రబాబు రెడీ చేసి ఉంచారనే అంటున్నారు. గత ఎన్నికల్లో నగరి సీటు ఆశించిన ఆ పారిశ్రామికవేత్త ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇచ్చినా తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. మరి గాలి ఫ్యామిలీ విబేధాలను పక్కన పెట్టి కలుస్తుందా ? లేక రాజకీయాలకు దూరమవుతుందా ? అనేది చూడాలి.