YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గంటాకు బీజేపీ గాలం

గంటాకు బీజేపీ గాలం

విశాఖపట్టణం, నవంబర్ 18,
వల వేయడంలో రాజకీయ పార్టీలు బాగా ఆరితేరిపోయాయి. ఒకపుడు ఎవరి పార్టీ గొడవలు వారు పడేవారు. ఇపుడు అలా కాదు పక్క పార్టీ ముచ్చట్లే అందరికీ కావాలి. ఆ విధంగా చూసుకుంటే ఏపీలో టీడీపీ తరువాతే ఎవరైనా అని చెప్పాలి. తెలుగుదేశానికి తనకు కావాల్సినంత మెజారిటీ ఉన్నా కూడా ఇతర పార్టీలకు గేలం వేయడం, ఎదుటి వారిని బలహీనులను చేయడం, రాజకీయంగా తీరని దెబ్బ కొట్టడం అలవాటుగా మారిపోయింది. ఇపుడు ఆ కల్చర్ అన్ని పార్టీలకు పాకింది. తేడా పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా ఆ అలావాట్లు బాగానే అయ్యాయని అంటున్నారు.నిజం చెప్పాలంటే బీజేపీ మొదటి నుంచి ఆ పనే చేస్తోంది. సొంత బలం ఏపీలో పెంచుకోకుండా ఎదుటి పార్టీల వైపు చూడడం, వారిని తమ పార్టీలోకి తెచ్చి బలం పెరిగిందని జబ్బలు చరచుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది ఇపుడు సోము వీర్రాజు కొత్త కామందుగా వచ్చాక అర్జంటుగా అధికారం మీద ఆశ పుట్టింది. ప్రస్తుత అసెంబ్లీలో సీటు ఒక్కటి కూడా లేకపోయినా కూడా బీజేపీ ఏపీలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలను ఎదిరించాలని బీజేపీలో కసి పెరిగిపోతోంది. దాంతో వీర్రాజు బాహాటంగానే టీడీపీ, వైసీపీ నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు.ఇక ఉత్తరాంధ్ర జిల్లాల మీద బీజేపీ కన్ను పడింది. ఇక్కడ టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టడంతో ఆ మిగిలిన పనేదో తాము కూడా చేస్తే పోలా అని బీజేపీ అనుకుంటోంది. దాంతో టీడీపీ లో మిగిలిన వారిని, వైసీపీ వైపు వెళ్ళలేని వారిని దగ్గరకు చేర్చుకోవాలనుకుంటోంది. ఆ విధంగా చూస్తే విజయన‌గరం జిల్లాలో సీనియర్ టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావుని బీజేపీ అక్కున చేర్చుకుంది. ఆయనకు ఇప్పటికే టీడీపీ వైసీపీలతో రాజకీయ సంబంధాలు ముగిసాయి. ఇలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ ని దువ్వుతోంది. వారి అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలనుకుంటోంది.తాజాగా పార్టీ పదవుల పంపిణీలో చంద్రబాబు గంటా వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన కనీసం గంటా శ్రీనివాసరావుని ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. వెనక వచ్చిన అనితను పొలిట్ బ్యూరో మెంబర్ ని చేసిన బాబుకు గంటాకు కూడా ఒక పదవి ఇవ్వడం కష్టం కాదు కానీ గంటాను కావాలనే దూరం పెట్టారు. అలాగే విజయనగరంలో ఉన్న ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడులతో సహా ఓ అతి పెద్ద గ్యాంగ్ నే ఏకంగా బీజేపీలోకి ఆహ్వానించాలను కుంటోంది. ఉత్తరాంధ్ర మీద కన్నేసిన సోము వీర్రాజు అక్కడే పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గంటాను రమ్మని పిలిచినట్లుగా టాక్ అయితే నడుస్తోంది. గంటా సరేనంటే ఉత్తరాంధ్రా రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి.

Related Posts