YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతులను ఆదుకోరూ...!

రైతులను ఆదుకోరూ...!

కన్నారం కర్షకులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమలో అకాల వర్షం జిల్లాలోని రైతుల్ని ఆగం చేసింది... ఈనెల 1వ తేదీన కురిసిన వడగళ్ల వాన వల్ల జిల్లాలో 790 ఎకరాల మేర పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మళ్లీ ఈ నెల 6వతేదీన అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు గాలివాన దుమారం వల్ల జిల్లా వ్యాప్తంగా మరో 158 ఎకరాలు నష్టపోయినట్లు గుర్తించారు. ఈ నష్టం విలువ రోజురోజుకు పెరుగుతోంది.

కర్షకుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. ప్రతికూల వాతావరణం వల్ల తగిలిన వడగళ్ల దెబ్బ దిగాలు పరుస్తోంది. ఆర్థికంగా కుదేలు పడేలా చేస్తోంది. ఫలితంగా జిల్లాలోని పలు మండలాల్లో చేతికొచ్చిన పంట నష్టం అవడంతో రైతుల ఆశలు ఆ‘వరి’ అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి కనిపిస్తోంది. పగలనక.. రేయనక.. ఎండనక.. వాననక ఇంటిల్లిపాది పంట కోసం పడిన శ్రమవృథా తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 948 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి ద్వారా వెయ్యి మందికిపైగా రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది.  పాక్షికంగా జరిగిన పంట నష్టాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఈ కోవకు చెందిన కర్షకుల జాబితా కూడా వేలసంఖ్యల్లో ఉండే వీలుంది.  నష్టం లెక్కింపు నుంచి పరిహారం చెల్లింపు వరకు అన్నదాతకు సరైన ధీమా అందే విషయమై అన్నదాతలో ఆందోళన కనిపిస్తోంది. దగా పడిన రైతును దిగాలు పరుస్తోంది. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో కనిపించని అధికారుల పర్యవేక్షణ శాపంగా మారుతోంది.  జరిగిన నష్టాన్ని తేర్చే తీరు దిశగా కర్షకుడి కళ్లు ఎదురుచూస్తున్నాయి.

చేతికొచ్చే దశలో నేలవాలిన మొక్కజొన్న పంటను చూపిస్తున్న ఈ రైతు పేరు బుట్ట నర్సయ్య. తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామం. వారం కిందట వడగళ్లకు నేలకూలిన పంటను ఇప్పటివరకు అధికారులు పరిశీలించలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానికంగా ఉన్న అధికారులకు చెబితే కంకి దశలో ఉన్న పంటకు పరిహారం రాదని చెబుతున్నారని కలత చెందుతున్నారు. కనీసం పంట తీరుని పరిశీలించి మేలు చేస్తారనే ఆశతో వాలిన మొక్కల్ని తొలగించడం లేదు. రెండున్నర ఎకరాల్లో వేసిన పంటలో సగం వరకు ఇలా పాడైందని బాధపడుతున్నారు.

జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తిస్తున్నారా..? పంటల వారిగా పరిశీలిస్తున్నారా..? రైతుకు ఉపశమనం కలిగించేలా భరోసా ఇస్తున్నారా..? అంటే మాత్రం అరకొరగానే అనే సమాధానం రైతుల నుంచి వినిపిస్తోంది. మొక్కుబడి వ్యవహారాలు.. చూసీచూడని తీరుతెన్నులు రైతును ఆగం చేస్తున్నాయనే తీరు ఆయా మండలాల్లో కనిపిస్తోంది. జరిగిన నష్టాన్ని గుర్తించి నివేదకలు తయారు చేసే  ప్రక్రియలో ఒకింత ఆలస్యం కనిపిస్తోంది. కొన్ని గ్రామాలకు కనీసం అధికారులు వెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సకాలంలో స్పందించాలని ఇబ్బందుల్ని తొలగించాలని నష్ట తీవ్రతను గుర్తించాలని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు.. ప్రజాప్రతినిధులు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అనుకున్న విధంగా కదలికలు కనిపించడంలేదు. కొన్ని మండలాల్లో కార్యాలయాల నుంచి  క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లని తీరు కనిపిస్తోంది.

వాస్తవానికి పంట చేను వద్ద పంట నష్టాన్ని గుర్తించి వివరాల్ని నమోదు చేయాలి. కానీ కొన్ని గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించడంలేదు. కేవలం రెవెన్యూ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు తుతు మంత్రంగా అంచనాల మదింపును చేపడుతున్నారు. తోచినకాడికి పంటల నష్టాల్ని గణాంకాలుగా పొందుపరుస్తున్నారు. పంట పరిశీలనలకు లేకుండానే వివరాలు సేకరిస్తే నిజంగా నష్టపోయిన రైతుకు తీరని అన్యాయం జరిగేవీలుంది. గతంలోనూ ఇలాంటి తీరుతెన్నులతో కొంతమంది రైతులు పరిహారం ప్రతిఫలాన్ని అందుకోలేని ఉదంతాలు జిల్లాలో ఉన్నాయి. కొన్నిచోట్ల కనీసం కర్షకుడి వైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంటనష్టం అంచనా పక్కాగా లేకపోతే చిక్కులు తప్పవనే వాదన రైతులనుంచి వినిపిస్తోంది. అకాల నష్టం జరిగిన సమయంలో అధికారులు మరింత పర్యవేక్షణను పెంచాల్సి ఉంటుంది. కానీ కొన్ని మండలాల్లో నష్టం తీవ్రంగానే జరిగినా ఆయా గ్రామాల వారీగా అందిన గణాంకాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. తీవ్రత అంతంత మాత్రమేననే ధోరణలో అధికారులు లెక్కలు కట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా దృష్టిసారిస్తే మేలనే భావన అన్నదాతలనుంచి వినిపిస్తోంది.

ప్రకృతి మిగిల్చిన అనర్థాన్ని అధిగమించేలా అన్నదాతకు అండగా నిలబడేలా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూశాఖ అధికారులు పరిశీలనలు ఊరూరా పంటల వారీగా పక్కాగా పరిశీలించాల్సిన అవరసముంది. వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి సంయుక్తంగా గ్రామంలో సర్వే నంబర్ల వారిగా పంటనష్టంపై వివరాలు నమోదు చేయాలి. వర్షం కురిసిన రెండు మూడు రోజల్లో దెబ్బతిన్న పంటల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు పంటలను పరిశీలిస్తేనే స్పష్టంగా నష్ట తీవ్రత తెలిసే అవకాశముంటుంది. కొన్ని చోట్ల అసలే పరిశీలించకపోవడం వల్ల ఇబ్బంది కనిపిస్తోంది. 33శాతం కన్నా తక్కువగా పంట నష్టం జరిగిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం వారివైపు కన్నెత్తి చూసేవారు లేరు. వాస్తవంగా ఈ పంటలను కూడా పరిశీలిస్తే మాత్రం మరింత మందికి మేలు జరగనుంది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, వీఆర్వోలు చెప్పిన గణాంకాలపైనే ఆధారపడుతున్నారనే ఆరోపణలున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా రైతు పొలానికి వెళ్లి పంట తీరుని గమనిస్తే వాస్తవంగా జరిగిన నష్టం తీరు అధికారుల చేతికి చేరేవీలుంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే మేలనే భావన రైతన్నల నుంచి వినిపిస్తోంది.

Related Posts