హైద్రాబాద్, నవంబర్ 18,
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమిని ముఖ్యమంత్రి కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఓటమికి గల కారణాలను ఆయన లోతుగా విశ్లేషించాలని నిర్ణయించుకున్నారు. సంక్షేమ పథకాలను ఎంతగా అమలు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారన్నది గులాబీ పార్టీలో చర్చనీయాంశమయింది. 2014 తర్వాత జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.కానీ సిట్టింగ్ స్థానం అందునా ఎమ్మెల్యే మరణించిన చోట ఎందుకు ఓడిపోయామన్నది ఇప్పటికీ గులాబీ పార్టీ నేతలకు అర్థం కాకుండా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అర్థమవుతున్నా దానిని అంగీకరించేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. ఎన్ని సంక్షేమ పథకాలు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , పింఛను పెంపుదల ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవేమీ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుకు ఉపకరించలేదు. ప్రధానంగా గత ఆరున్నరేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ వస్తే లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలొస్తాయని ఆశించిన యువతకు నిరాశే ఎదురయింది. ఈ అంశాన్ని బీజేపీ నేతలు బాగా హైలెట్ చేశారు. తమ రాష్ట్రం తమకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని భావించి యువత మొత్తం బీజేపీ వైపు నిలిచారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఇక తమ పార్టీలో ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి పార్టీని వీడకుండా చేయడంలో టీఆర్ఎస్ విఫలమయింది. కేసీఆర్ ఒక్కసారి పిలిచి మాట్లాడితే శ్రీనివాసరెడ్డి పార్టీ మారే వారు కాదంటున్నారు. కానీ శ్రీనివాసరెడ్డి విషయంలో చూపిన నిర్లక్ష్యం ఫలితాల్లో స్పష్టంగా కన్పించింది. బీజేపీకి లాభంగా మారింది. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద గుణపాఠం నేర్పిందనే చెప్పాలి. అతివిశ్వాసం, నిర్లక్ష్యం పనికి రాదని ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రగతి భవన్ కు చాటి చెప్పాయి. ఇప్పటికైనా కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడి ప్రజల్లోకి రావాల్సి ఉంటుంది.