విజయవాడ, నవంబర్ 18,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదం కావచ్చు. కొన్ని అతిశయం అనిపించవచ్చు. కానీ గ్రామస్థాయిలో మాత్రం జగన్ ప్రభుత్వం పనితీరును జనం మెచ్చుకుంటున్నారని తేలింది. ఇందుకు కారణం కష్టకాలంలోనూ జగన్ ఆదుకున్నారనే భావన ప్రజల్లో కలగడమే.ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత అభివృద్ధి కంటే సంక్షేమ కార్యక్రమాలకే పెద్దపీట వేశారు. ఒకరకంగా చెప్పాలంటే అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి సంక్షేమం వైపుకే జగన్ మొగ్గు చూపారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయానికి ఏపీ ఖజానాలో నిధులు కూడా లేవు. అయినా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్న ఆయన పట్టుదల ముందు అది పెద్ద సమస్య కాలేదు.ముఖ్యంగా కరోనా ప్రపంచ వ్యాప్తంగా భయపెట్టింది. కోట్లాది మంది జీవనోపాధిని కోల్పోయి ఇంటికే పరిమిత మయ్యారు. అయితే ఈ కష్టకాలంలో జగన్ లక్షల కుటుంబాలకు అండగా నిలిచారు. జగన్ వివిధ పథకాల ద్వారా అందించిన నగదు వారికి ఉపయోగపడిందని నేరుగా చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలని కోరుకుంటుండటం విశేషం.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 64 వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా పంచిపెట్టారు. మొత్తం 3.5 కోట్ల మందికి ఈ లబ్ది చేకూరింది. దీంతోపాటు కరోనా కాలంలో ప్రతి ఇంటికి వచ్చిన ఉచిత రేషన్ కూడా ప్రజలను ఆదుకుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్ పట్టు పెరగడానికి నగదు పంపిణీ ప్రధాన కారణమని చెబుతున్నారు. కరోనా కష్టకాలంలో తాము బతికున్నామంటే అది ప్రభుత్వం పుణ్యమేనని ప్రజలు చెబుతుండటం విశేషం. మొత్తం మీద పల్లె ప్రాంతాల్లో జగన్ కు మరింత పట్టు పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఏ ఎన్నిక జరిగినా అది జగన్ కు లాభమేనంటున్నారు విశ్లేషకులు.