బాత్రూమ్‌లో మహిళలను వీడియో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిని పోలీసులు కటాకటాల్లోకి నెట్టివేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్ వలస వచ్చి బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఓ సాప్ట్‌వేర్ కంపెనీలోని పారిశుద్ధ్య విభాగంలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు.హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న ధర్మేంద్ర కుమార్ ప్రతీరోజూ మహిళల బాత్రూమ్ లను కూడా కడిగేవాడు. తరచూ మహిళల బాత్రూమ్ లలో పనులు చేసిన ధర్మేంద్ర కుమార్ రహస్య కెమెరాలను అమర్చి వారు అర్ధనగ్నంగా ఉన్న వీడియోలను చిత్రీకరించి వాటిని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. కంపెనీలోని ఓ మహిళా ఉద్యోగిని బాత్రూంకు వెళ్లగా ధర్మేంద్ర కుమార్ తన మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో, ఫోటోలు తీస్తుండటం గమనించింది. అంతే మహిళా ఉద్యోగినులు అందరూ కలిసి ధర్మేంద్ర కుమార్ ను పట్టుకొని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ధర్మేంద్ర కుమార్ వద్ద ఉన్న ఫోన్ ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ధర్మేంద్ర కుమార్ ను విచారించగా తాను మహిళలు వాష్ రూంలో అర్దనగ్నంగా ఉన్న వీడియోలు తీశానని అంగీకరించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.