న్యూఢిల్లీ, నవంబర్ 18
ఢిల్లీలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో సీఎం కేజ్రీవాల్ కట్టడి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని మార్కెట్లలో కొన్ని రోజల పాటు లాక్ డౌన్ విధింపునకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్లలో ప్రజలు కరోనా నిబంధనలు పాటించని సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలు గుంపులుగా మార్కెట్లకు వెళ్తుండడంతో హాట్ స్పాట్ లుగా మారే ప్రమాదం ఉందని.. అందుచేత ఆ ప్రదేశాల్లో లాక్ డౌన్ అమలుకు నిర్ణయించామన్నారు. మరోవైపు అన్‌లాక్ ప్రక్రియలో వివాహాది శుభకార్యాలకు 200 నుంచి 50 మందిని మాత్రమే అనుమతించాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు ప్రతిపాదనలు పంపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని సంస్థలు కరోనా కట్టడికి రెట్టింపు కృషి చేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై కేజ్రీవాల్ ఉద్వేగంగా స్పందించారు. 'చేతులెత్తి మొక్కుతా.. మాస్క్‌లు పెట్టుకోండి' అని అభ్యర్థించారు. కాగా ఢిల్లీలో ఆదివారం 29,871పరీక్షలు చేయగా 3,797 కేసులు నమోదయ్యాయి. మరో 99 మంది చనిపోయారు. నవంబరులో 16 రోజుల్లోనే లక్ష కేసులు రాగా, 1,200 మంది చనిపోయారు.