YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పర్యాటకం పరులుగులు

పర్యాటకం పరులుగులు

అమరావతి :

నష్టాలు, లాభాలతో సంబంధం లేకుండా వచ్చిన దాంట్లోనే ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులను చూసుకొంటూ, కార్పొరేషన్‌ని నడిపిద్దాం.. అన్న రీతిలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) తీరు ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. గత ఏడాది వరకూ లాభాలు చవిచూడని ఈసంస్థ, ఇప్పుడు సుమారు రూ.20 కోట్లు ఆదాయం ఆర్జించింది. తొలిసారిగా లాభాల్లోకి అడుగుపెట్టడం, ఉన్నతాధికారులు, సిబ్బందిలో నూతన ఉత్సాహం నింపింది. ఇదే ఊపుతో ఏపీటీడీసీని మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు రూ.120 కోట్లతో 15 భారీ రిసార్ట్స్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం అవుతోంది. మొదటి విడతగా ఆరు ప్రాంతాల్లో రూ. 50 కోట్లతో నిర్మాణానికి పూనుకున్నారు.

పాతబడిన 15 రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసి స్టార్‌ హోటల్‌ స్థాయికి అధికారులు తీసుకువచ్చారు. పదేళ్ల పాటు నిరాదరణకు గురైన ట్రావెల్‌ విభాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకొన్నారు. దీనికోసం ఉన్నతాధికారులు కొత్త బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం 12 బస్సుల కొనుగోలుకు అనుమతులు ఇవ్వగా, ఇప్పటికే నాలుగు బస్సులను కొని తిరుపతి, విశాఖపట్నం జిల్లాలకు కేటాయించారు. మరో ఎనిమిది బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఇలా ట్రావెల్స్‌ నుంచి హోటల్స్‌ దిశగా ఒక్కొక్క విభాగాన్ని పునరుద్ధరిస్తూ వస్తున్నారు. అదే కోవలో కొత్త రిసార్ట్స్‌ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా జగతపల్లిలో రూ.20 కోట్లతో రిసార్ట్స్‌ నిర్మిస్తున్నారు. 3.71 ఎకరాల్లో రెండు విడతలుగా ఏర్పాటు చేయనున్నారు. మొదట విడతలో 1.87 ఎకరాలను, రెండో విడతలో 1.84 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. సీతంపేట ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని ఈ రిసార్ట్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక.. విశాఖపట్నం జిల్లా లంబసింగిలో రూ.7 కోట్లతో, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో రూ. 10 కోట్లతో, దిండిలో రూ.5 కోట్లతో, చిత్తూరు జిల్లా హార్స్‌హిల్స్‌ రూ.4 కోట్లతో రిసార్ట్స్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఇది కాకుండా కృష్ణాజిల్లా నాగాయలంకలో రిసార్ట్స్‌ నిర్మాణానికి కూడా పర్యాటక శాఖ సిద్ధం అయింది. దీని కోసం సుమారు 4 కోట్లు నిధులు కేటాయించేందుకు సిద్ధం అవుతోంది. కానీ జిల్లా యంత్రాంగం నుంచి భూ కేటాయింపు జరగకపోవడంతో ఇక్కడ నిర్మాణం పెండింగ్‌లో పడింది.

ప్రస్తుతం ఏపీటీడీసీ నిర్మించ తలపెట్టిన 15 ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు మొత్తం ఏపీటీడీసీ, రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తాయి. ఇవి కాకుండా మరికొన్ని రిసార్ట్స్‌ను స్వదేశీ దర్శన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లా డీజీ పాలెం, నెలపట్లు, కొత్తకోడూరు రిసార్ట్స్‌ నిర్మాణం జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా ఇసుకపల్లి, మైపాడు, రామతీర్థం, చిత్తూరు జిల్లా ఉప్పలమడుగు, ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వంటి ప్రాంతాల్లో రిసార్ట్స్‌ నిర్మాణం జరుగుతోంది. కాకినాడలోని కోరంగా ప్రాంతంలో కూడా ఒక రిసార్ట్స్‌ను నిర్మిస్తున్నారు.

Related Posts