హైద్రాబాద్, నవంబర్ 19,
కరోనా వ్యాధి నిర్ధారణకు చేసే ఆర్‌టిపిసిఆర్(రియల్ టైం రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) టెస్టు ధరను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షిస్తే రూ.850, ఇంటి వద్ద శాంపిల్ సేకరిస్తే రూ.1200 లను మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం పాత ధరలను సవరించింది. వీటి కంటే అదనంగా వసూల్ చేసిన ప్రైవేట్ ల్యాబ్‌లు, హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇది లా ఉండగా ఒక్కో ఆర్‌టిపిసిఆర్ టెస్టు ధర రూ. 950 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మూడు వారాల క్రితం ప్రైవేట్ ల్యాబ్‌లకు సూచించింది. ఈ రేట్లను వెంటనే అమలు చేయాలని అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. వారం రోజుల క్రితం ఎపిలో ఒక్కో ఆర్‌టిపిసిఆర్ టెస్టు ధర. వెయ్యి రూపాయలుగా కేటాయించగా, మన దగ్గర మాత్రం కేవలం రూ.850ను నిర్ణయిస్తూ ప్రభుత్వం తా జాగా ఉత్వర్తులు ఇచ్చింది. కరోనా వైరస్‌ను ఆర్‌టిపిసిఆర్ విధానంలో నిర్ధారించే ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రభుత్వం గతంలో ప్రత్యేక ధరలను నిర్ధేశించింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి ల్యాబ్‌లో టెస్టు చేస్తే రూ. 2200, ఇంటి వద్ద శాంపిల్ సేకరిస్తే రూ. 2800 తీసుకోవాలని జూన్ 15వ తేది వైద్యశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయి తే ఆ ధరలను తాజాగా ఆ శాఖ సవరించింది. ఆర్‌టిపిసిఆర్ టెస్టుకు వినియోగించే రీయోజెంట్(ఔషధాలు, పరికరాలు, ఇతర సామాగ్రి) ధరలు తగ్గడంతోనే టెస్టు ధరను తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. గతంతో పోల్చితే సుమారు 60 శాతం ధరలు తగ్గినట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.కరోనా వైరస్ నిర్ధారణకు వినియోగించే ఆర్‌టిపిసిఆర్, యంటీజెన్ కిట్లతో పాటు పిపిఇ కిట్లు, ఎన్95 మాస్కులు, త్రీ లేయర్ మాస్కులు, వైరస్ నిర్ధారణకు వాడే ఔషధాల ధరలు గణనీయంగా తగ్గడంతోనే టెస్టు ధరను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఆర్‌టిపిసిఆర్ టెస్టుకు వాడే రీయెజెంట్స్(నిర్ధారణకు ఉపయోగించే పరికరాలు, ఔషదాలు, ఇతరత్రా) అంతా కలిపి రూ.2500 ఉండగా, ప్రస్తుతం కేవలం రూ.250కి తగ్గిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్కో ఆర్‌టిపిసిఆర్ టెస్టు ధరను కేంద్రం రూ.950 నిర్ధారించగా, తెలంగాణలో కేవలం రూ.850 మాత్రమే నిర్ణయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. వాస్తవంగా కరోనా ప్రవేశించిన తొలినాళ్లల్లో టెస్టింగ్, ట్రీట్మెంట్లకు వినియోగించే పరికరాలు, మందులు ఉత్పత్తి అతి తక్కువగా ఉండేదికానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టెస్టింగ్ పరికరాలను, చికిత్సకు కావాల్సిన ఔషధాలను తయారు చేసే సంస్థలు సంఖ్య పెరగడంతో వాటి ఉత్పత్తి పెరిగిందని, దీంతో వాటి ధర తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేగాక యంటీజెన్ టెస్టు కిట్ల ధర కూడా సగానికి తగ్గింది. తొలినాళ్లలో ఆ కిట్ ధర రూ.504 ఉండగా, ప్రస్తుతం 275 తగ్గింది. అంతేగాక గతంలో పిపిఇ కిట్లు 500 నుంచి 1000 వరకు ఉండగా ప్రస్తుతం రూ.300కి తగ్గింది. అంతేగాక ఎన్ 85 మాస్కు ధర రూ.150 నుంచి 180 ఉండగా, ప్రస్తుతం అది 10 నుంచి 12లోపే లభ్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. అంతేగాక కరోనా క్రిటికల్ రోగుల కొరకు వాడే రెమిడెసివీర్ మందు గతంలో రూ. 3 నుంచి 4వేలు (ఎంఆర్‌పి) ఉండగా, ప్రస్తుతం 2వేలకు తగ్గినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.రాష్ట్రంలో ఆర్‌టిపిసిఆర్ విధానంలో 50 ప్రైవేట్ ల్యాబ్‌లు టెస్టులు చేస్తున్నాయి. వీటిలో ప్రతి రోజూ సగటున 50 లక్షల (పాత ధరలు ప్రకారం)బిజినెస్ జరుగుతున్నట్లుఎక్స్‌పర్ట్ అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వం సూచించిన ధరలు కంటే అదనంగా తీసుకోవడం వలనే ఈ స్థాయిలో వ్యాపారం కొనసాగిందని వైద్యశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వం అనేక మార్లు హెచ్చరించిన కొన్ని ల్యాబ్స్ బాధితుల నుంచి అదనంగా వసూల్ చేశాయని ఆయన చెప్పారు. కానీ ఈ సారి ధరల నియంత్రణ పకడ్బందీగా కొనసాగుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన ధరలు కంటే అదనంగా వసూల్ చేస్తే 104కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.