హైదరాబాద్ నవంబర్ 19
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎన్నికల తరవాత అడపాదడపా రాజకీయాలు మధ్యలో సినిమాలు అంటూ కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. పార్టీలో కొంతమందికి ప్రాధాన్యత ఇస్తున్నామని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ మీది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పవన్ ట్విట్టర్ వేదికగా సొంత పార్టీలోని కొందరి వైఖరిని తప్పుబట్టారు. నాయకులు నచ్చకపోతే తమకు హేతుబద్ధతతో తెలియజేస్తే మాట్లాడతామని అంతేగానీ ఎవరి చిత్తానికి వాళ్లు పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడితే కుదరదని పవన్ స్పష్టం చేశారు.అలా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాత్రం జనసేన నుంచి బయటక వెళ్లిపోయి మాట్లాడుకోవాలని జనసేనలో ఉంటూ తిడితే మాత్రం కచ్చితంగా కుదరదని పవన్ కళ్యాణ్ ఒక్క ముక్కలో స్పష్టం చేశారు. ఒక వంద మంది వెళ్లిపోతే బలహీనపడే వ్యక్తిని కానని వంద మంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకువస్తామని పవన్ తన పోస్ట్లో ధీమా వ్యక్తం చేశారు. గడ్డాలు పుచ్చుకుని బతిమలాడటం ఉండదని జనసేనాని తేల్చి చెప్పారు. రాజకీయాలు తనకేం సరదా కాదని రాజకీయాలు తనకు బాధ్యతని ప్రతి ఒక్కరు ఇదే స్పూర్తిని తీసుకువెళ్లాలని జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు.