విజయవాడ, నవంబర్ 20,
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇపుడు వార్తల్లో వ్యక్తి అయిపోయారు. తెలంగాణా రాష్ట్ర ఎన్నికల అధికారి పేరు రాయాలంటే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిరావచ్చేమో కానీ నిమ్మగడ్డ విషయం అలా కాదు, ఆయన అంతలా మీడియా రాజకీయానికి పరిచయం అయిపోయిన పేరు అయ్యారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం తీసుకుంటున్న షాకింగ్ డెసిషన్స్, ఆయన దూకుడు కూడా ఏపీలో హాట్ హాట్ పాలిటిక్స్ ని రగిలిస్తున్నాయి. నిమ్మగడ్డ సైతం బ్రేకింగ్ న్యూస్ గా మారుతున్నారు.ఇదిలా ఉండగా తాపీగా మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసిన నిమ్మగడ్డ అందులో బాంబు లాంటి న్యూసే పేల్చారు. ఏపీలో కూడా లోకల్ బాడీ ఎన్నికలు అంటూ ఆయన భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక డేట్ టైం తానే ఫిక్స్ చేశారు. ఏపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు జరుగుతాయని బోల్డ్ గా అసలు విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుండబద్దలు కొట్టారు. కానీ ఫిబ్రవరి నెల అన్నదే ఇపుడు ఎన్నికల విషయంలో కాస్త బ్యాడ్ టైం గా కనిపిస్తోంది.ఏపీలో ఇపుడు తిరుపతి లోక్ సభకు ఉన్న ఎన్నిక జరగాల్సి ఉంది. అది అనివార్యం కూడా . ఒక సభ్యుడు మరణిస్తే ఆరు నెలల వ్యవధిలోగా అక్కడ ఎన్నికలు జరిపించాలి. ఆ విధంగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో కరోనాతో మరణించిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ సీటు తిరుపతికి ఉప ఎన్నిక ఫిబ్రవరిలోనే వస్తుందని కచ్చితమైన అంచనా ఉంది.మరి లోక్ సభ ఉప ఎన్నిక అంటే అది పెద్ద తతంగమే. నోటిఫికేషన్ తో మొదలుకుని కనీసం నెలాళ్ళ ముందు నుంచి హడావుడి ఉంటుంది. దాంతో ఆ సమయంలో లోకల్ బాడీ ఎన్నికలు జరపడం అన్నది సాధ్యమయ్యేది కాదు. ఇక మిగిలింది మార్చి మాత్రమే. మరి ఆ ఒక్క మార్చి నెల ఏపీలోని రాజకీయాలను మార్చేసే సత్తా కలిగి ఉందా లేదా అన్నది వేచి చూడాలి. అది దాటితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుర్చీ దిగిపోతారు. ఇక అంతే సంగతులు.