గుంటూరు, నవంబర్ 20,
శృతి మించిన అతి.. ఎక్కడైనా ఎవరికైనా కూడా ప్రమాదమే. ఇప్పుడు ఇదే వైసీపీలోనూ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ను కింది స్థాయి కేడర్ పొడిగిందంటే.. ఆకాశానికి ఎత్తిదంటే.. అర్ధం ఉంటుంది. తమ ఐడెంటిటీ కోసం.. కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి.. ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి.. జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారని అనుకోవచ్చు. కానీ, ఘనత వహించిన మంత్రులు, ఎంపీలు కూడా జగన్‌ను పనిగట్టుకుని ఆకాశానికి ఎత్తేయడం.. ఆయన దయవల్లే నేను గెలిచాను.. అంటే.. ఎలా అర్ధం చేసుకోవాలి ? ఇదీ ఇప్పుడు నేతలకు ఎదురు తిరుగుతున్న పరిస్థితి.ఏ పార్టీలో అయినా.. అధినేతను పొగడడం అనేది కామనే. అయితే.. తమను తాము మరిచిపోయి.. తమకు ప్రజలు ఇస్తున్న విలువను కూడా వదిలేసి..“మాదంటూ… ఏమీలేదు.. డమ్మీలం.. కేవలం జగన్ టికెట్ ఇవ్వడం వల్లే మేం గెలిచాం.. లేకపోతే.. మేం వట్టి వెధవాయలం!“ అనే తరహాలో ప్రచారం చేసుకోవడంతో వైసీపీ నేతలపై ఏవగింపు పెరుగుతోంది. ఏ పార్టీలో అయినా.. అధినేత హవా ఉంటుంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో ప్రజలు అక్కడ టికెట్ సంపాయించుకున్న నేతనే తమ హీరోగా భావిస్తారు. ఆ నేతపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే.. నోరువిప్పితే.. మాదేం లేదు.. అంతా జగనే! అంటే.. ప్రజలు వీరిని ఎలా అర్ధం చేసుకోవాలి? అనేది కీలక ప్రశ్న. తాజాగా మంత్రి అనిల్ కుమార్ ఈ స్వామి భక్తిలో మరో నాలుగు అడుగులు ముందుకు వేశారు. “నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటే నడుస్తాం. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను“ అని వ్యాఖ్యానించడంపై నెల్లూరు ప్రజలు నవ్వుకుంటున్నారు. కేవలం మంత్రి పదవి.. అది కూడా మరో ఏడాది తర్వాత ఉంటుందో ఉండదో.. దానిని చూసుకుని.. తనను తాను ఇంతగా తగ్గించేసుకుని.. నియోజకవర్గం ప్రజలను కూడా అవమానించే ధోరణిలో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనిల్‌కు స్థానికంగానే కాకుండా స్టేట్ వైడ్‌గా కూడా ఆయన కమ్యూనిటీ యూత్‌లో మంచి పేరు ఉంది. పైగా అనిల్ మొన్న జగన్ ప్రభంజనంలో మాత్రమే కాదు… 2014 ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచారు. ఇంత క్రేజ్ ఉన్న అనిల్ ఇలా మాట్లాడడం ఆయన అభిమానులకు, పార్టీ వాళ్లలో కొందరికి నచ్చడం లేదు. వాస్తవానికి అనిలే కాదు.. చాలా మంది ఇదే భక్తి ప్రదర్శిస్తున్నారు. అంతా జగనే అంటున్నారు. మరి అంతా జగనే అయినప్పుడు.. వీరు ఉండీ చేసేది ఏంలేదన్నమాట..! అదే సమయంలో వీరు ప్రజలకు జవాబుదారీ కూడా కాదన్నమాట.తమలో ఎలాంటి నాయకత్వ లక్షణాలు కూడా లేవని ఒప్పుకొంటున్నట్టేనన్నమాట. అనే కామెంట్లు వస్తున్నాయి. ఏదేమైనా.. ఈ తరహా దూకుడు మంచిది కాదని అంటున్నారు పరిశీలకులు. మిమ్మల్ని మీరు తగ్గించేసుకుని.. జగన్‌ను పొగడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. రేపటి వేళ జగన్‌పై కేసుల తీవ్రత ఎక్కువుగా ఉంటే అప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ హవాతో నెగ్గుతారా ? లేక.. అప్పుడు కూడా జగన్ ఫొటో పెట్టుకుని గెలిచామని చెబుతారా ? అనేది మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మారింది