తిరుపతి, నవంబర్ 20,
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో పీసీసీ చీఫ్ శైలజానాధ్ ఒకసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ ను పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. చింతా మోహన్ తిరుపతి నియోజకవర్గానికి సుపరిచతమైన నేత కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు.చింతామోహన్ గతంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల చింతా మోహన్ కు సీడబ్ల్యూసీలో కూడా చోటు కల్పించారు. మిగిలిన పార్టీల ీఅభ్యర్థుల కన్నా చింతా మోహన్ గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో పాటు సొంత సామాజికవర్గంలోనూ ఓటు బ్యాంకు ఉండటం కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.చింతా మోహన్ ను బరిలోకి దింపితే కాంగ్రెస్ ను ఈ ఉప ఎన్నిక ద్వారా కొంత బలోపేతం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా లేదు. అయినా చింతా మోహన్ వ్యక్తిగత ఇమేజ్ తో ఓట్లను గణనీయంగా సంపాదిస్తారని భావిస్తున్నారు. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత కన్పిస్తుండటం, మోదీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి వైపు ప్రజలు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.బీజేపీ తాము బరిలో ఉంటామని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికకు సిద్ధమవుతుంది. అధికార వైసీపీ పార్టీ ీఅభ్యర్థి ఎవరన్నది నిర్ణయించనప్పటికీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ చింతా మోహన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు చింతామోహన్ ను ఏ మేరకు ఆశీర్వదిస్తారో చూడాల్సి ఉంది.