రాజమహేంద్రవరం నవంబర్ 20
ఎన్నికల కమీషన్ తీరుపై వైసీపీ ఎంపీ భారత్ ఫైర్ అయ్యారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎటువంటి అభ్యంతరంలేదని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు,వైకాపా పార్లమెంటరీ పార్టీ చీప్ మార్గాని భరత్ అన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి చాలా బాధాకరంగా ఉందని అన్నారు.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ తెలుగుదేశం పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగు తున్న సమయంలో అధిక శాతం తమ పార్టీకి చెందిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని,తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతయింది అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదు లోనే ఉండి కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసులు అతి తక్కువగా ఉన్న సమయంలో నే కరోనా పేరుతో గతంలో జరగాల్సిన ఎన్నికలను రద్దు చేశారని ప్రస్తుతం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతోనే తాము ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు చెప్పారు. వాస్తవంగా 2018 లో స్థానిక సంస్థల నిర్వహించాల్సి ఉందిఅని అయితే నాడు ఎన్నికల ఎందుకు నిర్వహించలేదో చంద్రబాబునాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థలను బ్రష్టు పట్టిం చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, దేశ చరిత్రలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన తమ ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమేనని అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన వైకాపా విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అన్నారు.