న్యూఢిల్లీ, నవంబర్ 21, సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి అమెరికా డ్రగ్ మేకర్ ఫైజర్ ఐఎన్‌సీ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ యూజ్ ట్యాగ్ కోసం అమెరికా ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనివల్ల ప్రక్రియ త్వరగా ప్రారంభమవుతుందని, వ్యాక్సిన్ డోస్ వచ్చే నెలలోనే అందుబాటులోకి రానుందని ఫైజర్ సంస్థ వెల్లడించింది. అయితే ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్‌కు అనుమతించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలించనుంది. ఒకవేళ ఎఫ్‌డీఏ ఓకే అంటే.. వ్యాక్సిన్ సరఫరా మొదలవుతుంది. అయితే ఇది అందరికీ అందాలంటే మరో మూడు, నాలుగు నెలలు ఆగాల్సిందేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని గత బుధవారం ఫైజర్ సంస్థ తెలిపింది. దీంతో దీనిని ఎమర్జెన్సీ వాడకానికి అనుమతించాలని అమెరికా నియంత్రణ సంస్థలను కోరినట్లు ఫైజర్ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలోనే కాకుండా యూరప్, యూకేల్లోనూ ఫైజర్ ఎమర్జెన్సీ వాడకం కోసం దరఖాస్తు చేసింది. ఫైజర్ టీకా ఇండియాకు వస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ దగ్గర స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇండియాలాంటి చాలా దేశాలకు అతి పెద్ద సవాలుగా మారింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇండియాకు లభించేలా ఉంటే.. దానిని స్టోర్ చేసే అంశాలను పరిశీలించనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ దగ్గర టీకాను స్టోర్ చేసేలా కోల్డ్ చెయిన్స్‌ను ఏర్పాటు చేయడం ఏ దేశానికైనా సవాలే అని ఆయన అన్నారు.