చిన్ని కృష్ణుడు తన ఐదవఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు *కార్తీక శు. అష్టమి.* శ్రీ కృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజును *' గోపాష్టమి'* పర్వదినంగా జరుపుకుంటాము. గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలి. ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్ఠతను తెలియజేయాలి. పంచగవ్య ప్రసాదాన్నివితరణ చేయాలి. గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి. గోశాలలను శుభ్రపరచి , గోవులను అలంకరించి విశేషపూజలను జరుపాలి. గో ఉత్పత్తుల తయారీ , ప్రదర్శన , విక్రయాలకు ప్రారంభించాలి. ‘గో’ అనగా ‘గోమాత’. ‘గోపా’ అనగా ‘గోప బాలుడు’. కార్తిక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని ‘గోపాష్టమి’ గా పిలుస్తారు. గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి , గోవు యొక్క పృష్ట భాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత *‘సురభీదేవి’.* కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఈ *‘శ్రీసురభ్యై నమః’* అనే మంత్రాన్ని జపించి , క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే , ఆయురారోగ్యైశ్వర్యాలు , అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. కీర్తి , ధనము , జ్ఞానము , క్షేమము ప్రసాదించే మహిమ గల స్తుతి ఈ *‘గోపాష్టమి స్తుతి’*. (దేవీ భాగవతం అంతర్భాగంగా)
*గోపాష్టమి స్తుతి:*
*లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం!*
*గవామధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్!!*
*పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం!*
*యయా పూతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజ్!!*
*నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః!*
*గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే!!*
*నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః!*
*నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః!!*
*కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే!*
*క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః!!*
*శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః!*
*యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః!!*